గుజరాత్‌లోని సూరత్‌లో ఓ కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటన వెనుక కారణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. భవన నిర్మాణంలో లోపాలు, సరైన అగ్నిమాపక ఏర్పాట్లు లేకపోవడంతో పాటు పలు ఇతర వసతుల లేమి కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఇదిలా ఉండగా.. భవనంలో మంటలు ఎగిసిపడుతున్నా.. అగ్నిమాపక సిబ్బంది చాలా సేపటి వరకు రాలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటనాస్థలాన్ని చేరుకునేందుకు 45 నిమిషాల సమయం తీసుకున్నారని అన్నారు.
‘భవనంలో మంటలు చెలరేగిన తర్వాత దట్టమైన పొగ అలుముకుంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఓ నిచ్చెన వేసుకుని కొంతమంది పిల్లలను బయటకు తీసుకొచ్చాను. ప్రమాదం జరిగిన శిక్షణ కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలోనే అగ్నిమాపక కార్యాలయం ఉంది. అయినప్పటికీ వారు ఫోన్ చేసిన 45 నిమిషాలకు ఘటనాస్థలానికి వచ్చారు’ అని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి వచ్చి ఉంటే ఇంకొంత మంది బతికి ఉండేవారేమోనని మరో ప్రత్యక్ష సాక్షి విచారం వ్యక్తం చేశారు.
సూరత్‌లోని సర్తానాలో గల ఓ శిక్షణ కేంద్రంలో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గ్రౌండ్‌ఫ్లోర్‌లోని ఏసీల్లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా మొదలైన మంటలు క్రమంగా భవనం అంతా వ్యాపించాయి. ఘటన సమయంలో భవనంలో కనీసం 50 మంది విద్యార్థులున్నారు. వీరంతా 20ఏళ్ల లోపువారే. ఈ ఘటనలో 20 మంది అగ్నికి ఆహుతవగా.. పలువురు గాయపడ్డారు. భవనంలో ఒక వైపు నుంచే మెట్లు ఉండటంతో పాటు అవన్నీ చెక్కతో చేసినవి కావడంతో మంటలు చూస్తుండగానే వ్యాపించాయి. దీంతో విద్యార్థులకు తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.