అమరావతిలో తొమ్మిది సిటీల ఏర్పాటు ప్రతిపాదనలపై సిఎం చంద్రబాబు సీఆర్‌డీఏతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాసిటీ ప్రతిపాదనల విషయమై ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తన ఆలోచనలను చంద్రబాబుకు వివరించారు. స్థానిక కళాకారులు, సాంకేతిక నిపుణులను వినియోగించుకుంటే ఏడాదిన్నరలో అమరావతిలో సినీ పరిశ్రమ రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సురేష్‌బాబు అన్నారు. హైదరాబాద్‌లో కేవలం స్టూడియోలు, నిర్మాణాల వరకే ఉన్నాయని, కానీ ఏపీలో సహజ సిద్ధమైన, ఆకర్షణీయమైన ప్రాంతాలున్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు.
మీడియా సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని, అర్హత గల సంస్థలను ఆహ్వానించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అలాగే ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో సుందరంగా తీర్చి దిద్దాలని అధికారులను ఆదేశించారు. అక్కడ పూలవనాలు, హరిత వనంగా తీర్చిదిద్దాలని సూచనలు చేశారు. అక్కడ మూడు కాలువలు, బ్యారేజీ సుందరీకరణకు ప్రణాళిక సిద్ధం చేశామని సీఆర్‌డీఏ అధికారులు ఈ సందర్భంగా చంద్రబాబుకు వివరించారు.
ఇదిలావుంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మూగ, చెవిటి, వికలాంగ ఉద్యోగ సంఘాల సభ్యులు గురువారం కలిశారు. ప్రయాణ భత్యం కింద రూ. 1300 మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ తమకు ఇంత మేలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్మానం చేస్తామని, అభినందన సభకు రావాలని ఆయన్ని ఆహ్వానించినట్లు తెలిపారు.