తెలుగు రాష్ట్రాలకు త్వరలో ఇద్దరు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ విషయమై చర్చించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలపాటు సుధీర్ఘంగా భేటీ జరిగింది. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లను నియమించే అంశంపై నిశితంగా చర్చించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్.. మర్యాదపూర్వకంగానే హోం మంత్రితో భేటీ అయ్యానన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితిని వివరించినట్లు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహపూర్వకంగానే ముందుకు సాగుతున్నాయని గవర్నర్ మీడియాకు వివరించారు.
తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొలుత భవనాల సమస్యలను పరిష్కారించామని.. త్వరలోనే మిగిలిన సమస్యలు పరిష్కారం అవుతాయని గవర్నర్ నరసింహన్ చెప్పుకొచ్చారు. అయితే కొత్త గవర్నర్లు నియామకం ఎప్పుడు జరుగుతుంది..? తెలుగు రాష్ట్రాలకు కొత్తగా వచ్చే గవర్నర్లు ఎవరు..? ఇప్పుడున్న గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణకు లేదా ఏపీ ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తారా..? లేకుంటే ఇద్దర్నీ కొత్తవారినే కేంద్రం నియమిస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సుష్మాస్వరాజ్ నియమితులయ్యారని, ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు అంటూ కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు.
దీంతో తెలుగు రాష్ట్రాల్లో సుష్మా నియామకంపై వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మి డాక్టర్ హర్షవర్ధన్ సుష్మకు ట్విటర్ వేదికగా తొలుత అభినందనలు తెలిపారు. ఇంతలో అధికారిక ప్రకటన ఏదీ వెలువడకపోవడంతో మంత్రి తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా తాను నియమితులైనట్లు వచ్చిన వార్తలపై బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కూడా ట్విట్టర్ లో స్పందించారు. ఈ వార్త అబద్ధమని తేల్చారు. తాను ఏపీకి గవర్నర్‌గా నియమితులైనట్లు వచ్చిన వార్తలు ఫేక్ అని స్పష్టం చేశారు. ట్విట్టర్ లో గవర్నర్ ని చేసిన నాకు థాంక్స్ అంటూ వ్యంగ్యంగా స్పందించారు.