తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడ గ్రామం వద్ద ఉన్న ప్రబోధానంద ఆశ్రమంలో గత రెండు రోజులగా జరుగుతున్న అరాచకం తెలిసిందే. గ్రామస్థుల పై దాడి చేసి, ఒకరిని చంపేశారు, ఆశ్రంలో భక్తుల పేరుతో ఉన్న ఉన్మాదులు. అయితే, ఈ ఆశ్రమ నిర్వాహకులకి సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది. తాడిపత్రిలోని ప్రభోదానంద ఆశ్రమ నిర్వాహకులు యోగానంద చౌదరి, ఆయన సోదరుడు జలందర్‌చౌదరి గత సంవత్సరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వారితో పాటు మరో 1500 మంది అప్పటి మంత్రి మాణిక్యాలరావు సమక్షంలో బీజేపీలో చేరారు. అయితే, అప్పటి నుంచే వీళ్ళ అరాచకాలు ఎక్కువయ్యాయి అని గ్రామస్తులు చెప్తున్నారు.
మాకు కేంద్రం అండ ఉంది అంటూ, తరుచూ గ్రామస్తులని ఇబ్బంది పెడుతూ ఉన్నారని తెలుస్తుంది. అయితే, నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా మరింతగా రెచ్చిపోయారు. ప్రబోధానంద ఆశ్రమ భక్తుల దాడిలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో 20మందికి గాయాలయ్యాయి. నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా ఆశ్రమ భక్తులకు, పెద్దపొలమడ గ్రామస్థులకు మధ్య వివాదం చెలరేగి ఘర్షణలకు దారితీసిన విషయం తెలిసిందే. గ్రామస్థులు పై ఆశ్రమంలో భక్తులు పేరుతో కర్రలు, రాళ్లతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్రమంలోకి వెళ్లి, గ్రామస్థులను రక్షించేందుకు బాష్పవాయువును ప్రయోగించడంతో పాటు గాల్లోకి రెండురౌండ్లు కాల్పులు జరిపారు.
అయితే ఈ ఆశ్రమం మరో డేరా బాబా ఆశ్రమంలా ఉందని, పోలీసులు అంటున్నారు. భక్తులంతా ప్రార్థనలు, పూజలు చేస్తారనే చెబుతున్నా.. వారి వ్యవహార శైలి అనేక సందేహాలను కల్పిస్తోందని పోలీసులు, రెవెన్యూ అధికారులు అంటున్నారు. ఆశ్రమంలోకి ఇతరులు ఎవరినీ అనుమతించరు. ఆశ్రమం చుట్టూ పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలు అమర్చడం, బయట ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, అలాగే భక్తులను అప్రమత్తం చేసేందుకు సైరన్ కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం. ఆశ్రమంలోపల పెద్దఎత్తున కర్రలు, రాళ్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రబోధానందకు కుమారుడు ఉన్నట్లు, శనివారం రాత్రి ఓ కారులో ఎక్కి వెళ్లిపోయేందుకు సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే భక్తులు వెంటనే స్వామీజీ కుమారుడికి రక్షణగా ఏర్పడి, అతడిని క్షేమంగా మళ్లీ ఆశ్రమంలోకి తీసుకెళ్లారు.