అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలంలో ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రభోదానందస్వామి వర్గీయులు, గ్రామస్తుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు చనిపోగా మరో 45 మందికి గాయాలు అయ్యాయి. వారిలో సీఐతోపాటు పది మంది పోలీసులు కూడా ఉన్నారు. గ్రామస్తులపై దాడికి దిగిన ప్రభోదానందస్వామి వర్గంపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ నిన్నటి నుంచి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందు భైఠాయించి నిరసన తెలుపుతున్నారు. నిన్న రాత్రి అంతా పీఎస్ ముందే ఉన్న ఆయన ఇప్పటికి కూడా అక్కడి నుంచి కదలలేదు.
ఉద్రిక్త పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీసి విచారణకు కమిటీ వేయాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్‌ను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్, డీఎస్పీ, ఆర్డీవో ఎమ్మార్వోతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భేటీలో అనంతపురం జిల్లా తెదేపా నేతలు కూడా పాల్గొన్నారు. శాంతిభద్రతలు కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని సీఎం స్పష్టం చేశారు. శాంతిభద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికార పార్టీల నేతలు ఎవరైనా శాంతిభద్రతల ఉల్లంఘనకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పార్టీలకు అతీతంగా పోలీసులు అక్కడ పరిస్థితులు అదుపులో ఉండేలా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఫోన్ చేసి తాడిపత్రిలో పరిస్థితిని వివరించారు. ఆశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని సీఎంను జేసీ కోరారు. మరో పక్క ఆక్టోపస్ ని రంగంలోకి దించాలని, గంట గంటకు పరిస్థితి సమీక్షిస్తూ, సాయంత్రానికి ఆర్డర్ లోకి రావాలని పోలీసులకి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. మరిన్ని బలగాలను తాడిపత్రికి రప్పించారు. ఆక్టోపస్‌ను బృందాలు కూడా రప్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అందరినీ బయటకు పంపేస్తామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు.