ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, రాజకీయాలు మాట్లాడితే, ఎక్కువగా చంద్రబాబుని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతారు. చాలా సార్లు యుట్యూబ్ వీడియోల్లో కూడా చంద్రబాబుని తిడుతూ ఉండటం చూసాం. అయితే నిన్న ఒక టీవీ ఛానల్ కు బ్రేక్ చేసిన సెన్సేషనల్ స్టొరీలో, తమ్మారెడ్డి భరద్వాజ టిడిపి నేతలు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ ఆపరేషన్ గరుడ మర్చిపోక ముందే, ఇప్పుడు తమ్మారెడ్డి 'ఆపరేషన్ బీ' అనేది కేంద్ర ప్రభుత్వం మొదలు పెడుతుందని చెప్పి, అందరినీ ఆశ్చర్య పరిచారు.
కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న తర్వాత... ఆ పార్టీ ఏపీపై మరింత తీవ్ర స్థాయిలో దాడికి తెగబడబోతోందనే వార్తలు తన వరకు వచ్చాయని ఆయన తెలిపారు. రానున్న 15 రోజుల్లో టీడీపీ సానుభూతిపరులైన ప్రముఖులు, తెలంగాణ, ఏపీలో టీడీపీకి అనుకూలంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఈ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఈడీ, ఐటీ దాడులు జరగబోతున్నట్టు తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. ప్రధాని కార్యాలయంలో ఉన్న ఒక కీలక అధికారి ఈ దాడులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దాడులు రేపట్నుంచి 15 రోజుల్లోగా జరగవచ్చని చెప్పారు.
ఏపీలోని దాదాపు 30 మంది ప్రముఖులపై ఐటీ దాడులకు స్కెచ్ వేశారని వారి పేర్లు కూడా చెప్పారు. ఐటీ టార్గెట్ లో ఏపీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, శిద్ధా రాఘవరావు ఉన్నట్టు సమాచారం ఉందని చెప్పారు. ఎంపీలు సీఎం రమేష్, మురళీ మోహన్ ను కూడా టార్గెట్ చేసారని చెప్పారు. ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్ కూడా ఈ లిస్టు లో ఉన్నారని చెప్పారు. కేఎల్ యూనివర్సిటీ అధినేతపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని, ఐటీ టార్గెట్‌లో విజయవాడలోని, డీవీ మేనర్, గేట్‌వే హోటళ్ల అధినేతలు కూడా ఉన్నట్టు తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. దీని పై ఎటువంటి విచారణకైనా సిద్ధమని, తనను విచారిస్తే, ఈ విషయం ఎలా తెలిసిందో, దర్యాప్తు సంస్థలకి చెప్తానని చెప్పారు. చంద్రబాబుని విమర్శిస్తూనే ఉంటానని, కాని, ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం పై, ఢిల్లీ వాళ్ళు కుట్రలు చేస్తా ఉంటే, ఆ కుట్రలు నాకు తెలిస్తే, ప్రజలకు చెప్పకుండా ఉండలేనని అన్నారు.