ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రాలు షాక్ ఇస్తున్నాయి. కరోనా కేసుల్లో, ఆంధ్రప్రదేశ్ రోజురోజుకీ దూసుకుపోతూ ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ లో జాగ్రత్తలు ఏమో కానీ, పక్క రాష్ట్రాలు మాత్రం, అలెర్ట్ అవుతున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మొహమాటం లేకుండా షాకులు ఇస్తున్నాయి. ఒక పక్క తెలంగాణాలో, గత వారం రోజుల నుంచి, రోజుకి 10, 15 కేసులకు మించి రావటం లేదు. నెమ్మదిగా పరిస్థితి అదుపులోకి వస్తూ వస్తుంది. దీంతో తెలంగాణా యంత్రాంగం ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. అయితే, ఇలాంటి సమయంలో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రోజుకి 80 కేసులు కొడుతూ, తెలంగాణాకు దూసుకు పోవటంతో, తెలంగాణా తమ సరిహద్దు గ్రామాలను అలెర్ట్ చేసింది. ముఖ్యంగా కర్నూల్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో, తెలంగాణా అలెర్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరూ రావద్దు, మనం కర్నూల్ కు వెళ్ళద్దు, ఏమి వచ్చినా మన రాష్ట్రంలోనే చూసుకుందాం, కర్నూల్ నుంచి కూరగాయలు వచ్చినా మాకు చెప్పండి అంటూ, అక్కడ పోలీసులు మైకులు ద్వారా చెప్పారు.

ఈ నేపధ్యంలోనే, తెలంగాణా ఇచ్చిన షాక్ కు మర్చిపోక ముందే, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా షాక్ ఇచ్చింది. తమిళనాడు ఒక అడుగు ముందుకు వేసి, ఏకంగా, సరిహద్దు గ్రామాల నుంచి, ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే రహదారులు అన్నిటి పై, ఏకంగా గోడ కట్టేయమని ఆదేశాలు వచ్చాయి. దీంతో అక్కడ రోడ్డుకి అడ్డంగా ఏకంగా గోడలు కట్టేసారు. వేలూరు జిల్లాలోని సరిహద్దులో, అక్కడి కలెక్టర్ ఆదేశాలు ప్రకారం, ఇలా చేసారు. ఒక పక్క, సరిహద్దు రాష్ట్రాలు, ఏపిని బూచిగా చూస్తుంటే, ఇక్కడ మాత్రం, who, అమెరికా, బ్రిటన్ మన రాష్ట్రంలో , జగన్ గారు చేస్తున్న కరోనా పోరాటం గురించి, ఆరా తీస్తుంది అంటూ, వైసీపీ నేతలు ఊదర గొడుతున్నారు. జరుగుతుంది ఇది, అయితే ప్రచారం వేరేలాగా ఉంది.

ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదలచేసింది. కొత్త కేసులతో... రాష్ట్రంలో కోవిడ్ సోకిన వారి సంఖ్య 1,177కు చేరింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో మరణాలు నమోదుకాలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 235 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది. ‌వివిధ ఆస్పత్రుల్లో 911 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది. కృష్ణా జిల్లాలో కొత్తగా 33 కేసులు నమోదుకాగ... మొత్తం కేసుల సంఖ్య 210కి చేరింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 23 కేసులు వచ్చాయి. వీటితో కేసులు 237కు చేరాయి. కొత్తగా కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు జిల్లాలో 7 కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,517 నమూనాలు పరీక్షించామని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్త కేసులతో కలిపి కర్నూలు జిల్లాలో మొత్తం కేసులు 292కు చేరాయి. నెల్లూరు జిల్లాలో 79, పశ్చిమ గోదావరి జిల్లాలో 54, శ్రీకాకుళం జిల్లాలో 4కు చేరాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read