టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతుదారులైన పారిశ్రామికవేత్తలపై ఐటీ, ఈడీ దాడులు జరగబోతున్నాయనేది తనకు వచ్చిన విశ్వసనీయ వార్త అని సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. తనకు తెలిసిన విషయాన్నే తాను చెప్పానని అన్నారు. ఆపరేషన్ గరుడ విషయంలో సినీ హీరో శివాజీని లోపల వేసి, విచారణ జరిపించాలని బీజేపీ, వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయమంటారేమో అనే ప్రశ్నకు బదులుగా... విచారణ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని చెప్పారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు తెలిసిన విషయాన్నే తాను చెప్పానని తెలిపారు.
ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్లే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిందని, అందువల్లే టీడీపీని ఇబ్బందులపాలు చేసే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందని తమ్మారెడ్డి విమర్శించారు. టీడీపీకి చెందిన నేతలను దొంగలుగా చూపించడం వల్ల, జనాల్లో టీడీపీని చులకన చేయాలనేది బీజేపీ ఆలోచన అని చెప్పారు. 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగలుగా చూపెడితే... ఓటర్లలో దాని ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుందో ఊహించగలమని అన్నారు. తనకు చంద్రబాబుపై ప్రత్యేకమైన అభిప్రాయం ఏమీ లేదని, గతంలో ఆయనను విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడం మాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు.
తనకు ఎదురు తిరిగిన వారందరినీ తొక్కేయాలనుకోవడం నియంతృత్వం అవుతుందని, అది ప్రజాస్వామ్యం కాదని తమ్మారెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు దొంగలైనప్పుడు ఎన్డీయేతో టీడీపీ కలిసున్నప్పుడే దాడులు చేసి ఉండవచ్చని... విడిపోయిన తర్వాతే ఎందుకు చేయాలని ప్రశ్నించారు. ఇదంతా అవకాశవాదమే అని చెప్పారు. దక్షిణాదిలో పాతుకుపోవడం అంత ఈజీ కాదనే విషయం కర్ణాటక ఉపఎన్నికల్లో బీజేపీకి తెలిసిపోయిందని... అందుకే 'ఆపరేషన్ బి'ని ప్రారంభించారని అన్నారు. కాంగ్రెస్ ను ఇంత వరకు విమర్శించామని... కానీ, బీజేపీ ఇంకా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దేశంలోని కీలక వ్యవస్థలను కూడా తమ లబ్ధి కోసం నాశనం చేస్తున్నారని అన్నారు.