వైసీపీ ప్రభుత్వం పెత్తందారీ పోకడలతో, ఫ్యాక్షనిజపు విధానాలతో యథేచ్ఛగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నా, ఎన్నికల కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నా, ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడంలేదని టీడీపీనేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయడు నిలదీశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే, రాప్తాడు నియోజకవర్గంలోని కొనగాలపల్లి మండలం, ముత్తవగగుంట్లలో ఓటర్లకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారని, మచిలీపట్నంలోకూడా ఇళ్లపట్టాలు పంచారని నిమ్మల తెలిపారు. తాడిపత్రిలో ప్రభుత్వ బ్యానర్లు కట్టి అట్టహాసంగా చీరలుపంచి, ఇదేవిధమైన కార్యక్రమం నిర్వహించారని, ఇంత జరుగుతుంటే, ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమానికి సంబంధించిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని చెప్పిన నిమ్మల, ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించిన వీడియోను విలేకరులకు ప్రదర్శించారు. నోటిఫికేషన్ వచ్చాక ఒకపక్క నామినేషన్లు వేస్తుంటే, మరోపక్క ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించిన కూపన్లను అధికారులు పంచడం ఏంటని ఆయన ప్రశ్నించారు. చాగలమర్రి మండలంలో ఎమ్మార్వో ఆదేశాలప్రకారమే ఇళ్లస్థలాల పనులుచేస్తున్నట్లు కిందిస్థాయి అధికారులు చెబుతున్నారన్నారు. (అందుకు సంబంధించిన వీడియోను కూడా ఎమ్మెల్యే చూపించారు.) తహసీల్దార్ ఆదేశాల ప్రకారమే తాను ఇళ్లస్థలాల్లో రాళ్లు పాతడానికి వచ్చినట్లు సదరు అధికారి చెప్పడం జరిగిందన్నారు.
నోటిఫికేషన్ వచ్చాక ఇలాంటిపనులు జరుగుతుంటే, ఎన్నికల కమిషన్ మొద్దు నిద్ర పోతోందా అని నిమ్మల నిలదీశారు. 25 సంవత్సరాల నుంచి బీసీలకు అమలవుతున్న 34శాతం రిజర్వేషన్లు జగన్ వచ్చాక 24 శాతానికి పడిపోయాయని, ఆ 24శాతం కూడా అమలుచేయకుండా, జగన్ ప్రభుత్వం బీసీలను మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తోందన్నారు. స్థానిక ఎన్నికల కోటాలో కేవలం 12శాతం రిజర్వేషన్లు మాత్రమే జగన్ ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. అందుకు ఉదాహరణ నెల్లూరుజిల్లానేనని, ఆజిల్లాలో 46 జడ్పీటీసీలుంటే, 6స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారని, 562 ఎంపీటీసీలుంటే, కేవలం 59 ఎంపీటీసీలు మాత్రమే బీసీలకిచ్చారని నిమ్మల పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్లను అపహాస్యం చేసిన జగన్, 10.49శాతం రిజర్వేషన్లు మాత్రమే జిల్లావ్యాప్తంగా బీసీలకు అమలు చేశారని ఆయన మండిపడ్డారు. తడ, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో ఎంపీపీలు బీసీలకు రిజర్వ్ అయితే, ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా బీసీలకు ఇవ్వలేదన్నారు. ఓపెన్ కేటగిరీలో బీసీలు ఎన్నికవకపోతే, ఆ పదవి బీసీలకు రాదనే విషయం తెలిసికూడా ప్రభుత్వం వారికి అన్యాయం చేయడానికే ఇటువంటి చర్యలకు పాల్పడిందన్నారు. 25ఏళ్ల నుంచి హక్కుగా ఉన్నబీసీల రిజర్వేషన్లు మింగేసి, పార్టీపరంగా ఇస్తామంటూ జగన్ కపటనాటకం ఆడుతున్నారన్నారు. వైసీపీప్రభుత్వ తీరుతో తమకు జరిగిన అన్యాయంపై బీసీలు నిలదీయాల్సిన సమయం వచ్చిందని, స్థానిక ఎన్నికల్లో వారంతా ప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధి చెప్పాలని నిమ్మల పిలుపునిచ్చారు.
ఎన్నికల కోసం రాష్ట్రాన్ని 5 రీజియన్లుగా విభజించిన ప్రభుత్వం, వాటికి ఇన్ ఛార్జ్ లుగా రెడ్లయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలను నియమించిందని, ఒక్క బీసీకి కూడా ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. బీసీలపట్ల జగన్ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా, ఎంతటి కక్షతో వ్యవహరిస్తోందో ఆ నియామకాలే చెబుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడాకూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడంలేదని, గెలిచే అవకాశంలేనిచోట ప్రభుత్వం ఎన్నికలు వాయిదావేస్తోందన్నారు. పీలేరు నియోజకవర్గంలో 4 మండలాలకు సంబంధించి, 18 ఎంపీటీసీల్లో ఎన్నికలు జరపడంలేదని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కు రహస్య జీవో ఇచ్చిందని, తమపార్టీకి అనుకూలంగా లేదనే, వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిమ్మల మండిపడ్డారు. పాలకొల్లులో కూడా మున్సిపల్ ఎన్నికలు వాయిదావేశారని, రెండువార్డుల్లో సమస్య ఉంటే, మొత్తం వార్డుల్లో ఎన్నిక నిలిపివేశారన్నారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నచోట ఒకలా, అధికారపార్టీకి అనుకూలంగా ఉన్న చోట మరోలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నా, ఎన్నికల కమిషన్ చోద్యం చూడటం సిగ్గుచేటన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాకకూడా స్వాగతద్వారాలు, హోర్డింగులు, బ్యానర్లు తొలగించలేదని, ఇప్పటికీ విగ్రహాలకు ముసుగులు వేయలేదన్నారు. నోటిఫికేషన్ వచ్చి 4 రోజులవుతున్నా, ప్రభుత్వ కార్యాలయాల్లో జగన్ ఫొటోలు కనిపిస్తున్నా, కార్యాలయాల బయట ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారచిత్రాలు, బ్యానర్లు కనిపిస్తున్నా వాటిని అలానే వదిలేశారన్నారు. రాష్ట్రంలో ఇంతజరుగుతున్నా ఎన్నికల కమిషన్ ప్రభుత్వంపై ఎందుకు కొరఢా ఝళిపించడంలేదని నిమ్మల ప్రశ్నించారు.
ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే, రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తోందా..లేక వైసీపీ ప్రభుత్వమా అన్న సందేహం కలుగుతోందన్నారు. అధికారులు ముఖ్యమంత్రితో కలిసి నిఘా యాప్ ఆవిష్కరించడమేంటని ప్రశ్నించిన రామానాయుడు, డబ్బు, మద్యం పేరుతో తీసుకొచ్చిన అర్డినెన్స్ కూడా ప్రభుత్వానికే మేలుచేసేలా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల్లో గెలుపుకోసం ఎన్నికుట్రలు పన్నినా, ఎన్నివిధాలుగా అధికారయంత్రాంగాన్ని దుర్వినియోగంచేసినా, వైసీపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. ప్రభుత్వాన్ని నడిపించే సలహాదారులుగా తమసామాజికవర్గం వారే పనికొస్తారని నిస్సిగ్గుగా జగన్ అసెంబ్లీలోనే చెప్పాడని, ఆయన ఉద్దేశానికి అనుగుణంగానే పార్టీ, ప్రభుత్వ పదవుల్లో వారికే అగ్రతాంబూలం లభిస్తోందన్నారు. బడుగు, బలహీన వర్గాల సామర్థ్యంపై జగన్ కు ఎంత నమ్మకముందో ఆనాడు ఆయన మాటలతోనే తేలిపోయిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఘోర పరాభవం తప్పదని నిమ్మల తేల్చిచెప్పారు. స్థానిక ఎన్నికల్లో గెలుపుఓటములు అనేవి తెలుగుదేశం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపవని, రాబోయే నాలుగేళ్ల ప్రజాజీవితంపై మాత్రం అవి కచ్చితంగా ప్రభావం చూపుతాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిమ్మల స్పష్టంచేశారు. జగన్ కు ఒక్క అవకాశమిస్తే ఏంజరిగిందో, ఎలాంటి దుష్పలితాలు చవిచూశారో ప్రజలందరూ చూశారన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే, జగన్ పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తున్నాడని, అవి ముగిశాక వాటన్నింటికీ కోతలు పెట్టడం ఖాయమన్నారు.