ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న ఘటనల చుట్టూ రాజకీయం నడుస్తుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ కుట్రను చేదించలేకపోవటం, ప్రతిపక్షం ఈ అంశాన్ని తీసుకోవటంతో, మొత్తం వ్యవహారం పై ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతుంది. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్, బాధ్యతగా ప్రకటనలు ఇవ్వాల్సింది పోయి, ఈ ఘటనలు అన్నీ ప్రతిపక్షాలు చేస్తున్నాయని తేల్చి పడేసారు. అంతే కాదు, ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా, దాన్ని డైవర్ట్ చేయటానికి ఇవన్నీ చేస్తున్నారు అంటూ, ఏదో దగ్గరుండి చూసినట్టు చెప్పారు. దేవాలయాల పై ఘటనలు చేసి, మళ్ళీ వాళ్ళే దేవాలయాల వద్దకు వస్తున్నారని, రధాలు తగలబెట్టి రధయాత్రాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ముఖ్యమంత్రి వద్ద ఇంత స్పష్టమైన సమాచారం ఉండటం పై, తెలుగుదేశం పార్టీ అనుమానిస్తూ, ఏకంగా డీజీపీకి లేఖ రాసింది. తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబెర్ వర్ల రామయ్య, డీజీపీకి లేఖ రాసారు. ఆ లేఖ సారంశం ఏమిటి అంటే, "రాష్ట్రంలో దేవాలయాల పై జరుగుతున్న ఘటనలు మీకు తెలిసిందే. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, నెల్లూరులో జనవరి 11న మాట్లాడుతూ, దేవాలయాల పై ఘటనలు చేస్తున్న వారు తనకు తెలుసని చెప్పారు."
"రధాలు తగలబెట్టిన వారి వివరాలు తెలుసు అని చెప్పారు. అంటే దీని ప్రకారం, ఆయను ఎవరు దేవాలయాల పై వరుస ఘటనలు చేస్తున్నారో తెలుసు. నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కూడా మీడియాతో మాట్లడుతూ ఇదే విషయం చెప్పారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ సలహాదారుకు ఈ విష్యం తెలుసు అని అర్ధం అవుతుంది. ఈ నేపధ్యంలో, గతంలో మీరు, ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు, మీడియాలో వచ్చిన మాటలు చూసి, 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి, వివరాలు తెలపమని మీరు కోరినట్టే, బహిరంగ వేదిక పై దేవాలయాల పై ఘటనలు చేసిన వారు ఎవరో తెలుసు అని చెప్తున్న జగన్ కు కూడా, 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇవ్వాలని కోరుతున్నా. తద్వారా ఈ కేసులో మీకు మంచి పురోగతి ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చే ఆధారాలతో, మీరు తొందరగా కేసు నమోదు చేస్తే, ప్రజలు హర్షిస్తారు" అంటూ వర్ల రామయ్య డీజీపీకి రాసిన లేఖలో తెలిపారు.