ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల విషయంలో, బీసీ రిజర్వేషన్ తగ్గింపు ఇష్యూతో ఇబ్బంది పడుతున్న జగన్ కు, పంచాయతీ ఆఫీసులకు రంగుల విషయంలో కూడా, ఎదురు దెబ్బ తగిలే అవకాసం కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వభవనాలకు, పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, గుడులు, వాటర్ ట్యాంక్ లు, మరుగుదొడ్లు, శ్మశానాలకు అధికారపార్టీ రంగులేయించిన వైనంతోపాటు, వాలంటీర్ల వ్యవస్థ ను అడ్డంపెట్టుకొని, ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం సాయంతో అధికారపార్టీ స్థానిక ఎన్నికల్లో గెలవాలని చూస్తోందని, ఈనేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నడుచుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేసినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి కళా వెంకట్రావు తెలిపారు. గురువారం ఆయన పార్టీ పొలిట్ బ్యూరోసభ్యలు వర్ల రామయ్య, ఎమ్మెల్సీలు పీ. అశోక్ బాబు, మంతెన సత్యనారాయణ రాజు, శాప్ మాజీఛైర్మన్ పీ.ఆర్.మోహన్, పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రలతో కలిసి ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ని కలిశారు. ప్రలోభాలకు తావులేకుండా, అధికారపార్టీ అరాచకాలు, రౌడీయిజానికి స్థానం లేకుండా, ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించేలా చూడాలని టీడీపీ తరుపున ఎన్నికల కమిషన్ ను కోరినట్లు కళా వెంకట్రావు విలేకరులతో చెప్పారు.
రంగులు వేయడాన్ని ఇప్పటికే హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో, వాటిని ఎంత త్వరగా తొలగిస్తే అంతమంచిదన్నారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ప్రభావం, వారి జోక్యం ఎన్నికల్లో లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశామన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, 90శాతం వరకు వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించామని చెప్పడంజరిగిందని, ఆయన మాటల వీడియోను కూడా ఎన్నికల కమిషన్ కు ఇవ్వడమైందన్నారు. ఎన్నికల్లో మందు, డబ్బు ప్రభావం లేకుండా చూడాలంటూ, రాష్ట్రప్రభుత్వం ఇటీవలే ఒక చట్టం తీసుకొచ్చిందని, దాని ముసుగులో ప్రతిపక్షపార్టీ సభ్యులను లక్ష్యంగా చేసుకోవాలనే కుట్ర పూరిత ఆలోచనల్లో జగన్ అండ్ కో ఉన్నట్లుగా తమకు అనుమానం కలుగుతోందన్నారు. కాబట్టి ఆ చట్టం ముసుగులో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చూడాలని, ప్రతిపక్ష పార్టీ సభ్యులపై మోపే తప్పుడు కేసులను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ ను కోరడం జరిగిందన్నారు. విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపైనే ప్రభుత్వం దాడికి పాల్పడిందని, అటువంటప్పుడు సామాన్య నేతలు, కార్యకర్తలను స్థానిక ఎన్నికల్లో లక్ష్యంగా చేసుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
ఇక శాసనమండలి సభ్యులు, మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, " ఎగ్జిక్యూటివ్ రాజధాని పేరుతో విశాఖ చుట్టు పక్కల సుమారు 39వేల ఎకరాలను కబ్జా చేసిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో.. ఇప్పుడు ఏకంటా ట్రస్టు భూములు, ఆలయ భూముల్ని కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు యత్నించడం సిగ్గుచేటు. సింహాచలం ఆలయ భూముల్లో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకున్నా.. జగన్మోహన్ రెడ్డికి అదే చివరి రోజు అవుతుంది. దోచుకోవడం, దాచుకోవడం, అమ్ముకోవడం వంటి తప్పుడు విధానాల్లో ఆరితేరిపోయిన ఏ -1, ఏ-2 దేవాలయాల జోలికి వస్తే క్షమించేది లేదని గుర్తుంచుకోవాలి. విజయనగరం రాజ వంశీకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజుపై జగన్మోహన్ రెడ్డి అండ్ కో పథకం ప్రకారం కుట్ర పన్నారు. రహస్య ఉత్తర్వులతో ఆయనను సింహాచలం దేవస్థానం చైర్మన్ పదవి నుండి, విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్(మాన్సాస్) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించడం కుట్ర కాదా?" అంటూ ధ్వజమెత్తారు.