నిన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, గుంటూరులో జరిగిన మహిళా మోర్చా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై దిగాజరి మాట్లాడారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో బాలన్స్ కోల్పోయి, ‘రాష్ట్రంలో ముందు నీ పదవి కాపాడుకో... తర్వాత దేశం గురించి ఆలోచించవచ్చు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. ‘రాష్ట్రంలో గరుడ పురాణ కాలక్షేపం జరుగుతోంది. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాంగ్రె్‌సను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మాయావతి కాళ్ల వద్ద కూర్చున్నారు. ’ అని చెప్పారు.
అయితే రాం మాధవ్ మాట్లాడిన మాటల పై, తెలుగుదేశం నేతలు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర్ అన్నారు. రాంమాధవ్‌కు ఆయన ఇంట్లో ఓట్లు కూడా పడవు అని, ఆ కారణంగానే ఆయన ఉత్తర భారతదేశంలో తిరుగుతారని ఎద్దేవా చేశారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ, వైసీపీ నాయకుల కుట్రలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. జగన్‌పై దాడి ద్వారా ప్రజలను రెచ్చగొట్టి అలజడులు సృష్టించాలని చూశారని దినకర్ ఆరోపించారు.
లాబ్ రిపోర్ట్ రాకముందే జగన్ విమాన ప్రయాణం చేశారని, విమానాశ్రయం కేంద్రం పరిధిలో ఉంటుందని బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం భద్రతా వైఫల్యాలను ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేయడం దేనికి? అని ప్రశ్నించారు. గవర్నర్ నేరుగా డీజీపీకి ఫోన్ చేయడంలో ఆంతర్యం ఏంటి? అని నిలదీశారు. పోలీసుల విచారణకు జగన్ ఎందుకు సహకరించలేదన్నారు. నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ అంటూ వైసీపీ నేతలు చూపించిన ఐడీ కార్డు ఫేక్ అని అన్నారు.