వైసీపీ ప్రభుత్వం దిగజారుడుతనంతో ప్రలోభాల ఎరవేస్తూ, టీడీపీనుంచి వలసలను ప్రోత్సహిస్తోందని, అందులో భాగంగానే కీలకనేతలైన డొక్కా మాణిక్యవరప్రసాద్, కదిరి బాబూరావు, సతీశ్ రెడ్డి వంటి వారిని లాగేసుకుందని టీడీపీనేత, ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. వలసలను ప్రోత్సహించమంటూ బీరాలు పలికిన జగన్, స్థానిక ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కొనే ధైర్యం లేకనే, ప్రతిపక్షపార్టీలోని నేతలకు ఎరవేస్తున్నాడన్నారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీయే లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న నేతలు, ఆపార్టీలోని నేతలకోసం ఎందుకు అర్రులు చాస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ధనదాహంతో పాటు, రాజకీయదాహం కూడా ఎక్కువైందని, దాన్ని తీర్చుకోవడానికి, స్థానిక ఎన్నికల్లో విజయం సాధించడానికి దిక్కుమాలిన పనులన్నీ చేస్తున్నాడని అశోక్ బాబు మండిపడ్డారు. తెలుగుదేశం నేతలను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్న జగన్, ఏ లెక్కన వారిని చేర్చుకుంటున్నాడో సమాధానం చెప్పాలన్నారు. కడపలో సతీశ్ రెడ్డిని వైసీపీలోకి తీసుకున్న ముఖ్యమంత్రి, గతంలో అదే సతీశ్ రెడ్డి, తన తాతను చం-పా-డ-ని నానాయాగీ చేశాడన్నారు.
తన తాతను చం-పి-న వ్యక్తిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా, తానుచేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని, ఇప్పటి తన చర్యలతో జగన్ చెప్పకనే చెప్పాడని, అటువంటి నీతిమాలిన చర్యలకు పాల్పడినందుకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలన్నారు. గిట్టనివారిపై తప్పుడు ప్రచారం చేయడం.... అవసరమున్నప్పుడు వారినే అక్కున చేర్చుకోవడమనేది జగన్ కు మాత్రమే తెలిసిన దిక్కుమాలిన విద్య అని ఎమెల్సీ దుయ్యబట్టారు. తన తండ్రిని చం-పిం-చిం-ది రిలయన్స్ వారేనని గతంలో మొసలికన్నీరు కార్చిన జగన్, నేడు వారు చెప్పిన వ్యక్తికే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి సిద్ధపడటం ఎంతటి రాజకీయ వికృత క్రీడో ప్రజలంతా ఆలోచించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే వైసీపీ, కడపలో సతీశ్ రెడ్డిని, డొక్కా మాణిక్యవరప్రసాద్, కదిరి బాబూరావు, కృష్ణా, నెల్లూరుజిల్లాల్లోని నేతలు సహా, తదితరులను లాగేసుకుందన్నారు.
ఆ భయం రోజురోజుకీ అధికారపార్టీలో పెరుగుతుండబట్టే, టీడీపీనేతలను లోబరచుకోవడానికి సామ, దాన, బేధ, దండోపాయాలను అధికారపార్టీ ప్రయోగిస్తోందన్నారు. డొక్కా కూతురికి జడ్పీటీసీ పదవి ఇస్తామని ఆశచూపిన వైసీపీ ప్రభుత్వం, ఆయన్ని లొంగదీసుకుందన్నారు. 10నెలల్లో బ్రహ్మండమైన పాలన అందించామని ఇన్నాళ్లు ప్రగల్భాలు పలికిన వైసీపీ ప్రభుత్వ, మాటలకు బీటలు పడ్డాయని నేటితో తేలిపోయిందన్నారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎవరిమీదైతే తప్పుడుఆరోపణలు చేశారో, ఇప్పుడు వారినే తనపార్టీలోకి ఎందుకు చేర్చుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి స్పష్టంచేయాలన్నారు. కొందరు నేతలు టీడీపీ నుంచి వెళ్లినంత మాత్రానా ఆపార్టీకి వచ్చే నష్టమేమీలేదని, మద్యం, డబ్బు పంచి ఎన్నికల్లో గెలవాలని జగన్ చూస్తున్నాడని, ఆయన ఆటలు ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనివ్వమని అశోక్ బాబు తేల్చిచెప్పారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లే నేతలందరి పరిస్థితి కరివేపాకులా తయారవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆయన తేల్చిచెప్పారు. కష్టమైనా, నష్టమైనా టీడీపీలో ఉండి, ప్రజలపక్షాన నిలిచినవారికే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని టీడీపీనేత స్పష్టంచేశారు.