తెలంగాణాలో అక్రమమగా దొంగలించిన టిడిపి డేటా అప్పుడే వైసీపీ చేతికి వచ్చేసింది... ఐటి గ్రిడ్ నుంచి అక్రమంగా దొంగలించిన తెలుగుదేశం కార్యకర్తల డేటాని, తెలంగాణా పెద్దలు, వైసీపీ నేతలకు అప్పగించారని తెలుగుదేశం ఆరోపిస్తుంది. టీడీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలు ఫోన్లు చేసి మభ్యపెడుతున్నారని, ఒక్కో ఓటుకు రూ. 5వేలు అంటూ ప్రలోభ పెడుతున్నారని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఓ టీడీపీ కార్యకర్తకు వచ్చిన ఫోన్ వాయిస్ రికార్డును మీడియా ముందు ప్రదర్శించారు. గొల్లపూడికి చెందిన శీను నాయక్ అనే కార్యకర్తకు వైసీపీ నేతల నుంచి ఫోన్ వచ్చిందన్నారు. ఇలా ప్రతిరోజు వేల మంది కార్యకర్తలకు వైసీపీ నేతలు ఫోన్లు చేసి డబ్బు ఆశ చూపుతున్నారని మంత్రి అన్నారు.
దీనికి సంబంధించిన ఆధారాలను ఆయన మీడియా ముందు బహిర్గతం చేశారు. గొల్లపూడికి చెందిన శీనునాయక్ అనే కార్యకర్తకు వైకాపా కాల్ సెంటర్ నుంచి వచ్చిన ఫోన్ వాయిస్ రికార్డును మీడియా సమావేశంలో మంత్రి వినిపించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కొందరు ఓటుకు ఐదు వేలిస్తామంటూ మభ్య పెడుతున్నారని.. స్థానికులే వారిని పోలీసులకు అప్పజెప్పారని మంత్రి తెలిపారు. ఓ మహిళ తనకు ఫోన్ చేసి మీ డేటా అంత మా దగ్గర ఉందని.. జగన్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని చెప్పారని కార్యకర్త శీను నాయక్ ఈ మీడియా సమావేశంలో తెలిపారు. ప్రలోభపెట్టి, మభ్య పెట్టే ప్రయత్నం చేశారన్నారు. అయితే.. వైసీపీ ప్రలోభాలకు లొంగేది లేదన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో డిలీషన్ టెక్నాలజీ, ఏపీలో డెవలప్మెంట్ టెక్నాలజీ ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లు తొలగించి తెరాస తిరిగి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఏపిలోనూ అదే తరహా కుట్రలను కేసీఆర్ ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఏపీలో తెలంగాణ తరహా కుట్రలను జగన్ కోసం కేసీఆర్ చేస్తున్నారు. వైకాపా ఎంపీ అభ్యర్థులను కేసీఆర్, భాజపా నిర్ణయిస్తున్నాయి. ఫామ్ హౌసుల్లో కూర్చొని రామ్ మాధవ్, కేసీఆర్ వైకాపా ఎంపీ అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు.’ అని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంతో జగన్ కుమ్మక్కై ఏపీ పోలీసులపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు.