రాష్ట్రంలో ఇసుకను జెపి పవర్ వెంచర్స్ కు అప్పగించడంపై ప్రభుత్వం కాకమ్మ కబుర్లు చెబుతోందని టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. సోమవారం మంగళగిరిలోని టిడిపి జాతీయ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పలేక కలుగులో దాక్కొని ద్వివేది లాంటి అధికారులతో చిలక పలుకులు పలికిస్తున్నారని అన్నారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థకు టెండరు ఖరారు చేసి 24గంటలు గడవకముందే టన్నుకు 100రూపాయలకు పైగా ధర పెంచి ప్రజలపై భారం మోపిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అధికారికంగానే టన్నకు వందరూపాయలు పెంచారని, ప్రతి నియోజకవర్గాని ఒక యార్డు ఏర్పాటుచేసి హ్యండ్లింగ్ చార్జీల పేరుతో మరికొంత అదనపు భారాన్ని మోపుతారని అన్నారు. ఈ మొత్తం కలిపితే 10టన్నుల లారీకి యార్డులోనే 8వేల రూపాయలకు పైగా పలుకుతుందని తెలిపారు. రవాణా చార్జీలు కలిపితే వినియోగదారుడి ఇంటికి చేరేలోగా 10టన్నులు 20వేల రూపాయల వరకు అవుతుందని అన్నారు. క్విడ్ ప్రో కో లేకపోతే రాష్ట్రంలోని 3 రీజియన్ల టెండర్లు ఒకే కంపెనీ ఎలా దక్కించుకుంటుందని ఆయన ప్రశ్నించారు. లక్షలాదిమంది కార్మికులను రోడ్డున పడవేయడానికి ఈ ప్రభుత్వానికి మనసెలా ఒప్పిందని ప్రశ్నించారు. టెండరు దక్కించుకున్న జయప్రకాష్ పవర్ వెంచర్స్ లో పెద్దిబొట్ల గంగాధర శాస్త్రి డైరక్టర్ గా ఉన్నారా, లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గంగాధర శాస్త్రి రాంకీ సంస్థలో డైరక్టర్ ఉన్నారా, లేదా అని పట్టాభి నిలదీశారు. దీనిని క్విడ్ ప్రోకో అనకపోతే మరేమంటారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 2కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు 9లక్షల టన్నుల ఖనిజం తవ్వకం అనుభవం ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. ఇసుక టెండరు బాధ్యత నిర్వహించింది ఎంఎస్ టిసి అయినప్పటికీ గైడ్ లైన్స్ రూపొందించింది రాష్ట్రప్రభుత్వమే కదా అని అన్నారు. ఏడాదికి కేవలం రూ.54కోట్లు మాత్రమే జెపి సంస్థకు లాభం వస్తుందని మీరు ఎలా చెబుతారు? రూ. 54కోట్ల కోసం వందలకోట్ల రూపాయల యంత్రసామాగ్రిని ఏవిధంగా రప్పిసుతందని అన్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం టన్నుకు 384రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని, మరో 64 రూపాయలు నిర్వహణకు ఖర్చవుతుందని అన్నారు. టన్నుకు కేవలం 27 రూపాయల లాభం కోసం 3వేల 500 కోట్లరూపాయల నష్టంలో ఉన్న కంపెనీ వందల కోట్లరూపాయల యంత్ర సామగ్రిని ఎలా రప్పిస్తుందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రతిరోజు 1.25లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. వరదల సమయంలో కొద్దిరోజులు తవ్వకాలు జరగకపోయినా ఏడాదికి 300 రోజుల్లో 3కోట్ల 75లక్షల టన్నులు ఇసుక తవ్వకాలు జరుగుతాయని అన్నారు. 2కోట్ల టన్నులు మాత్రమే తవ్వకాలు జరుగుతాయని ఎలా చెబుతారన్నారు. గతంలో స్టాక్ యార్డుల్లో 2లక్షల టన్నుల ఇసుక గాలికి వెళ్లిపోయిందని చెప్పిన పెద్దిరెడ్డి ఇప్పడు కూడా అటువంటి లెక్కలే చెబుతారా అని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా కేవలం అధికారికంగా తవ్విన లెక్క మాత్రమే ద్వివేది చెబుతున్నారని, అనధికారికంగా వైసిపి నాయకులు దోచుకున్న ఇసుక సంగతేమిటని ప్రశ్నించారు. హోల్ సేల్ గా రాష్ట్రాన్ని లూటీ చేయాలని చూస్తే ఊరుకోం. న్యాయబద్ధంగా మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలపై భారం తగ్గించేవరకు తెలుగుదేశం పార్టీఉద్యమిస్తుందని, క్విడ్ ప్రోకోపై సమాధానం చెప్పే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. గత రెండేళ్లలో దోచుకున్న దానికి రెట్టింపు మొత్తంలో దోపిడీకి జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందని, ఈ దోపిడిని అడ్డుకొని తీరుతామని పట్టాభి స్పష్టంచేశారు. ప్రభుత్వ దోపిడీ విధానాల కారణంగా రోడ్డున పడే భవన నిర్మాణ కార్మికులు, ప్రజలతో కలిసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఉద్యమిస్తామని పేర్కొన్నారు.