తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ పై విరుచుకు పడ్డారు, ఆయన మాటల్లోనే, "జనాన్ని తాకట్టు పెట్టి రుణాలు తెచ్చేందుకు జగన్ రెడ్డి సిద్ధమయ్యారు. మున్సిపల్ పన్నులు పెంచి సామాన్యుల నడ్డి విరిచేందుకు పూనుకున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టేందుకు మీరు ఒప్పుకోబట్టే కేంద్రం రుణాలకు అనుమతి ఇచ్చింది. రేషన్ సరుకుల ధరల పెంచి పేదల నోటి దగ్గర కూడు లాగేశారు. రూ.2,525 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు ప్రజల మెడలకు ఉరితాళ్లు బిగిస్తారా? మీటర్లు అమర్చి రైతులు గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అసలే తీవ్ర నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని మీటర్ల బిగింపుతో కోలుకోలేని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాగ్ రిపోర్టు ప్రకారం ఆరు నెలల్లో చేయాల్సిన అప్పుకుంటే 14 శాతం అధికంగా జగన్ రెడ్డి అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రమూ చేయనంత అప్పులు చేశారు. గత ఏడాది 39 శాతం మద్యంపై ఆదాయం వస్తే ఈ ఏడాది 59 శాతం ఆదాయం వచ్చింది. ఇంత ఆదాయం వచ్చినా అప్పులెందుకు పెరిగాయి? పెట్రోల్, లిక్కర్, డీజల్ పెంచడం వల్ల రూ.20 వేల కోట్లు అదనపు ఆదాయం వచ్చింది. కేంద్రం ఇచ్చే డబ్బులు, అప్పులు మీద, ప్రజలపై వేసే పన్ను భారాల మీద ఆధారపడి జగన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 18 నెలలైనా ఇంకా ఆదాయాన్ని పెంచలేక ప్రజలపై పన్నులు వేసి ఆదాయాన్ని పిండుతున్నారు. ఆదాయం పెంచడానకి మీకు ప్రజలు తప్ప మరో ప్రత్యామ్నాయం కనబడకపోవడం దురదృష్టకరం. రుణాల మీద ఉన్న మోజు ఆదాయన్ని పెంచడంపై ఎందుకు లేదు?"
"మీరు చేసే అప్పులు రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తులో గుదిబండగా మారనున్నాయి. పాలన చేతకాక ఇంట్లో కూర్చుని రుణాలు మరిగి పన్నుల రూపంలో ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. జగన్ మాఫీయా రాష్ట్రాన్ని కొండశిలువల్లా చుట్టేసి ప్రజలను లూటీ చేస్తున్నారు. ఒక పక్కన అడ్డగోలుగా పన్నులు పెంచుతూ ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతీస్తున్నారు. ఇంకో పక్క ఆర్ధిక వ్యవస్థను చిన్నా భిన్నం చేస్తూ ఆర్థిక వ్యవస్థ పతనానికి మూలకారకుడు జగన్ వ్యవహరిస్తున్నారు. ప్రజల చెమటోడ్జి సంపాదించుకున్న డబ్బును శిస్తుల రూపంలో గుంజుకోవడం పద్దతి కాదు. ప్రజల కడుపుమాడ్చి వైసీపీ నేతల జేబులను జగన్ నింపుతున్నారు. మీ స్థానంలో సామాన్యులను కూర్చోబెట్టినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారి ఉండేది కాదు. దశ, దిశ లేక రాష్ట్రాన్ని దివాళా తీయించారు. 18 నెలల్లో లక్షా 40 వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క తట్ట మట్టి తీయలేదు. ఒక్క బొచ్చెడు కాంక్రీట్ వేయలేదు. సృష్టించిన ఆస్తి ఒక్కటీ లేదు. ఒక్క ప్రాజెక్టు నిర్మాణంకానీ, ఒక రోడ్డు నిర్మాణం కానీ చేసింది లేదు. లక్ష40 వేలకోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లింది.?ప్రజల రోజు వారి ఆదాయం దారుణంగా పడిపోయి ప్రజల జీవనం దుర్భరంగా మారింది" అని అచ్చెన్నాయుడు
అన్నారు.