సుప్రీం కోర్టు ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవడానికి అనుమతిచ్చినప్పటి నుండి విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు లు ఎన్నికల కమిషనర్, చంద్రబాబు ల గురించి అసందర్భోచిత, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటుగా విమర్శించారు. శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కులం పేరు పెట్టి, నిమ్మగడ్డ, కంద గడ్డ, ఉల్లిగడ్డ, చేమదుంప అని మాట్లాడడం సబబేనా? ఈ చేతకాని ప్రభుత్వం ఉద్యోగ సంఘాల్ని ఉసిగొల్పి పిటీషన్లు వేయించింది. సుప్రీంకోర్టు న్యాయంగా తీర్పు ఇవ్వడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం చెల్లక వైసీపీ నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారు. ఎస్ఈసీ, చంద్రబాబునాయుడులను అసభ్య పదజాలంతో, సభ్యసమాజం తల దించుకునేలా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు. విజయసాయిరెడ్డి మతిస్థిమితం లేనివారు మాట్లాడినట్లుగా ఉంది. విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో వచ్చే నెగిటివ్ కామెంట్స్ ని తట్టుకోలేక తన ఫాలోవర్స్ ని బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆయన తన మైండ్ సెట్ ను మార్చుకోవాలి. నిమ్మగడ్డ మతిస్థిమితం లేనివారని మాట్లాడేకన్నా ముందు విజయసాయిరెడ్డి మైండ్ సెట్ ని సరిచేసుకోవాలి.
కుట్రలు, కుతంత్రపు ఆలోచనలు మానుకోవాలి. చంద్రబాబునాయుడు రాజకీయాల గురించి మాట్లాడకపోతే వైసీపీ నాయకుల్లా ఇసుక, సారాయి, భూదందాల గురించి మాట్లాడాలా? సూట్ కేస్ కంపెనీ కుంభకోణాల్లో ఆరితేరిన విజయసాయిరెడ్డి కి జనాన్ని ఎలా ముంచాలో అనుభవముంది తప్ప రాజ్యాంగాన్ని గౌరవించాలని ఏం తెలుసు. మనం ఇంత పర్సెంటు గెలవాలి, ఇన్ని ఏకగ్రీవాలు కావాలని ప్రకటనలు చేసినప్పుడు లేని తప్పు మంచి నాయకులను ఎన్నుకొండి, గ్రామాలను అభివృద్ధి పరచుకొండని చంద్రబాబునాయుడు చెబితే తప్పా. విజయసాయిరెడ్డి ఎస్ఈసీ, చంద్రబాబునుద్దేశించి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకుని ఎస్ఈసీకి, చంద్రబాబుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కోర్టులు అనేకసార్లు మొట్టిక్కాయలు వేస్తున్నప్పటికిని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. విజయసాయిరెడ్డి ఎంపీగా కొనసాగే నైతిక హక్కు లేదు. రాజ్యాంగ వ్యవస్థల్ని అగౌరవపరచినన్నాళ్లు టీడీపీ పోరాడుతూనే ఉంటుంది.