తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం చవిచూశాక టిడిపి టికెట్ పై గెలిచి వైసీపీలోకి నలుగురు ఎమ్మెల్యేలు జంప్ కొట్టారు. మరొకరు మౌనం దాల్చారు. అప్పటికి వైసీపీకి తిరుగులేదని, టిడిపి వచ్చే ఎన్నికలకూ పుంజుకోదని వీరు భావించారు. వ్యాపారాలు, ఆస్తులు కాపాడుకోవడానికి, కేసుల నుంచి రక్షణగా ఉంటుందని..అధికార పార్టీ అండగా అక్రమాలు చేయొచ్చనే లక్ష్యంతో వైసీపీలో చేరకుండానే వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. టిడిపి నుంచి ఎవరైనా తన పార్టీలో చేరాలంటే రాజీనామా చేయాలంటూ పులిలా గర్జించిన వైసీపీ అధినేత జగన్ రెడ్డివి పులిహోర కబుర్లేనని టిడిపి ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే తన పార్టీలోకి తీసుకున్నారు. తెలుగుదేశంలో ఉంటూ జగన్ మోహన్ రెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరతాడని అందరూ ఊహించారు. అయితే అన్నం తినేవాడెవడూ వైసీపీలో చేరడంటూ స్టేట్మెంట్ ఇచ్చిన వంశీ, అన్నం తినడం మానేశాడేమో వైసీపీలో చేరాడు. అప్పటి నుంచీ టిడిపిపైనా, చంద్రబాబుపైనా, ఆయన భార్యపైనా, లోకేష్ పైనా, ఆయన భార్యపైనా చాలా అసభ్యమైన కూతలు కూస్తున్నాడు. ఇదే సమయంలో ఇక్కడ టిడిపి బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడంలో విఫలమైంది. అయితే అనూహ్యంగా వైసీపీలో వంశీకి యార్లగడ్డ, దుట్టాల నుంచి తిరుగుబాటు ఎదురైంది. వల్లభనేని వంశీ అనే నటోరియస్ ని ఎదుర్కోవాలంటే తాము కలవక తప్పదని యార్లగడ్డ, దుట్టా డిసైడయ్యారు. తనకు పోటీనిచ్చే సరైన అభ్యర్థి టిడిపి దొరకడనే ధీమాలో ఉన్న వంశీకి వైసీపీలోనే ఉక్కపోత సృష్టించారు. వైసీపీలో మూడువర్గాల పోరుని వాడుకుంటే ఇక్కడ టిడిపికి బాగా కలిసి వస్తుందని టిడిపి కేడర్ ఆశాభావంతో ఉన్నారు. కేసులు, కేసినోలు, హైదరాబాద్ ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం వైసీపీలో చేరితే..వైసీపీ వాళ్లే తనతో ఆడుకుంటుండడంతో తీవ్ర ఒత్తిడిలో వల్లభనేని వంశీ ఉన్నారు.
విశాఖ దక్షిణం నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్కుమార్ వైసీపీలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, బయటపడలేని దుస్థితి. తనపై ఓడిపోయిన వైసీపీ అభ్యర్థిదే పెద్దరికం. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ని మొహరించింది వైసీపీ. సొంతగూటికి వద్దామనుకున్నా టిడిపి గండి బాబ్జీ వంటి గట్టి కేండిడేట్ని నియోజకవర్గ ఇన్చార్జిగా వేసేసింది. చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం, వైసీపీలో చేరాక బలహీనరాం అయ్యారు. టిడిపిలో ఉన్నప్పుడు నిత్య అసంతృప్తి వాదిగా ఉండే కరణం..వైసీపీలో తన ఆటలు సాగవని మౌనంగానే బతిమాలుకుని తన పనులు చక్కబెట్టుకుంటున్నారు. కొడుకుకి సీటు కోసం చేరితే అది దక్కే అవకాశం లేదని, ఇటు చీరాల సీటూ పోతుల సునీత బీసీ కోటాలో తన్నుకుపోయే చాన్స్ ఉందని కరణం క్యాంపులో ఆందోళన నెలకొంది. ఇక గుంటూరు పశ్చిమ టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి వైసీపీలో చేరాక కూరలో కరివేపాకు అయ్యారని ప్రచారం సాగుతోంది. వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన ఏసురత్నమే అన్నీ చూసుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో గిరికి సీటు కూడా కష్టమేనని అంటున్నారు. టిడిపికి దూరంగా ఉంటూ వైసీపీలో చేరాలని విశ్వప్రయత్నం చేసి విఫలమైన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు..మళ్లీ టిడిపి తలుపు తట్టారు. కానీ గతంలాగ టిడిపిలో గంటా పవర్ పాలిటిక్స్ చేసే సీను ఉండకపోవచ్చని ప్రచారం సాగుతోంది. మొత్తానికి టిడిపి వీడి వైసీపీలో చేరిన ఈ ఎమ్మెల్యేలకు కొన్ని ప్యాకేజీలు దక్కడం, కేసుల నుంచి ఉపశమనం లభించడం మినహాయించి వచ్చే ఎన్నికలకి భవిష్యత్తు మాత్రం లేదని సమీకరణాలు స్పష్టం చేస్తున్నాయి.