మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు శాంతియుత ఆందోళనలు చేస్తున్నాయి. చంద్రబాబు పిలుపు మేరకు, టీడీపీ కార్యకర్తలు, నాయకుల నిరసనలు తెలుపుతున్నారు. అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలుపుతున్నారు. అచ్చెన్నాయుడును వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. అయితే, ఇది ఇలా ఉండగా, శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు, మార్గ మధ్యలో ఉన్న బలమైన తెలుగుదేశం నాయకులు అందరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యటం, లేదా అదుపులోకి తీసుకోవటం చేస్తున్నారు. విశాఖపట్నం, గోదావరి జిల్లాల్లో బలమైన నాయకులను, విజయవాడలో దాదాపుగా అందరు తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసే సమయంలో ఆయన సోమ్మసిల్లి పడిపోయారు. స్టేషన్ లో అలాగే పడుకుని ఉన్నారు. ఇక విజయవాడలో గద్దె రామ్మోహన్, దేవినేని ఉమా, వర్ల రామయ్య తదితరులను హౌస్ అరెస్ట్ చేసారు. పార్టీ ఆఫీస్ కు వెళ్ళాలి అని చెప్పినా, బయటకు వదిలేది లేదని తేల్చి చెప్పారు.
ఇక శ్రీకాకుళంలో నల్ల జెండాలతో టీడీపీ నేతల ధర్నా చేపట్టారు. అచ్చెన్నాయుడి అరెస్టుకు నిరసనగా టీడీపీ నేతల నిరసన తెలిపారు. ధర్నాలో రామ్మోహన్ నాయుడు, బెందాళం అశోక్, కలమట వెంకటరమణ, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గున్నారు. మాజీ మంత్రి శాసనసభ పక్ష నేత అచ్చెన్నాయుడు ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ముందస్తు ప్రణాళికతో అక్రమంగా అరెస్టు చేయడం హేయమైన చర్య అని వైసిపి ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని అచ్చెన్నాయుడు అరెస్ట్ అప్రజాస్వామికమని వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ప్లే కార్డులు చేతపట్టుకొని నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల ముందు అచ్చెన్నాయుడు అరెస్టు చేయడం చూస్తుంటే శాసనసభలో అతను ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో ఎలాగైనా అతన్ని శాసన సభకు రాకుండా తప్పించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో భయానక వాతావరణం సృష్టించాలని ఆలోచనతో ప్రభుత్వం తీరు ఉందని ఇది ఎన్నాళ్ళు సాగదన్నారు.