మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను తెదేపా ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, టి.డి.జనార్దన్ కలిశారు. ఈరోజు సాయంత్రం రాధాకృష్ణ కార్యాలయానికి వెళ్లిన తెదేపా నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. భేటీ అనంతరం జనార్దన్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సందేశాన్ని రాధాకు అందజేశామని.. అలాగే ఆయన్ను టీడీపీలోకి ఆహ్వానించామని వెల్లడించారు. దీనిపై తన నిర్ణయాన్ని రాధా రేపు వెల్లడిస్తానన్నారని పేర్కొన్నారు. ఈనెల 25న రాధా తెదేపాలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ ఇటీవలే వైకాపాను వీడిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాతో కృష్ణా జిల్లాలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాధాకృష్ణ చేరికతో విజయవాడ నగరంలో తెదేపా మరింత బలపడుతుందని తెదేపా నేతలు భావిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేరడం ఖాయమైంది. ఈ నెల 21న రాధా తన అనుచరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో రాధా తన రాజకీయ భవిష్యత్తుపై చర్చించినట్లు సమాచారం. అత్యధికులు టీడీపీలో చేరడమే మంచిదని ఆయనకు చెప్పినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు దృష్టిలో పెట్టుకుని జనసేనలో చేరితే బాగుంటుందన్న సూచనలు కూడా వచ్చినట్లు వినికిడి. మరోవైపు రాధా టచ్‌లో ఉన్న టీడీపీ నేతలు మాత్రం ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. రాధా మాత్రం టీడీపీకి వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి రాధా టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే రాధా టీడీపీలోకి 25వ తేదీన టీడీపీలోకి వస్తారని సీఎం చంద్రబాబు ధ్రువీకరించారు.
21న జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రాధా టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రయోజనాల కోసమే రాధాను టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. రాధాను కలుపుకుని వెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం రాధా రంగ మిత్ర మండలి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వంగవీటి రాధా ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీట్లు అమ్ముకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. "మాట తప్పను.. మడమ తిప్పను అంటే ఇదేనా?" అంటూ మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధా రంగా అభిమానులెవరూ వైసీపీకి ఓటు వేయొద్దని ఈ సందర్భంగా విజయవాడతో పాటు రాష్ట్ర ప్రజలకు రాధా రంగ మిత్ర మండలి సభ్యులు పిలుపునిచ్చారు. అయితే ఈ ఆరోపణలపై వైసీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.