రాష్ట్రంలో సామాన్యులకు అండగా నిలిచిన ‘చంద్రన్న బీమా’ పథకం కింద అందించే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచే అంశాన్ని టీడీపీ పరిశీలిస్తోంది. కుటుంబ యజమాని మరణిస్తే ప్రస్తుతం ఈ పథకం కింద రూ.5లక్షలు అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని తెలుగుదేశంపార్టీ ఆలోచిస్తోంది. వ్యవసాయానికి ప్రస్తుతం ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను 9గంటల నుంచి 12గంటలకు పెంచే అంశంపైనా దృష్టి పెట్టింది. వీటిని మేనిఫెస్టోలో చేర్చేందుకు టీడీపీ నాయకులు నిర్ణయించారు. టీడీపీ మేనిఫెస్టో కమిటీ బుధవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో యనమల రామకృష్ణుడి అధ్యక్షతన సమావేశమైంది. కాల్వ శ్రీనివాసులు, పుష్పరాజ్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
కొత్తగా మ్యానిఫెస్టోలో ఏం పెట్టాలి? ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఏం చేయాలి? అన్నదానిపై చర్చ జరిగింది. మహిళలకు పసుపు-కుంకుమ పథకం, రైతులకు పెట్టుబడి నిధి అందిస్తున్న అన్నదాత సుఖీభవ, యువతకు నిరుద్యోగ భృతితోపాటు ఇతర సంక్షేమ పథకాలను కొనసాగిస్తారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ఏర్పాటుచేసిన ప్రత్యేకనిధిని పెంచడం, యువతకు సాయం చేసేందుకు యువజన కార్పొరేషన్ ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. గురువారం మరోదఫా సమావేశం కానున్నారు. అనంతరం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయి తుది నిర్ణయం జరిగాక మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రెండు, మూడురోజుల్లోనే మేనిఫెస్టో విడుదల ఉంటుందని సమాచారం.
తెదేపా మేనిఫెస్టోలో పొందుపరచనున్న మరికొన్ని ముఖ్యాంశాలు * ప్రత్యేక యువజన కార్పొరేషన్ ఏర్పాటు. * పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రం. * వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు. * వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడంతో పాటు, సకాలంలో ఉత్పత్తుల్ని కొనుగోలు చేసేందుకు చర్యలు. మార్కెట్ జోక్యం పథకం బలోపేతం. * అన్నదాత-సుఖీభవ, పసుపు-కుంకుమ పథకాల కొనసాగింపు. * ఐదు నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరాకి సాగునీరు.