కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీతో భేటీ అయిన ఇద్దరు రాజీనామాలు సమర్పించారు. కాగా పౌర విమానయానశాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు.. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయడంలో కేంద్రం విఫలమైన కారణంగానే మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చిందని వీరిద్దరూ ప్రధానికి వివరించారు. తమ రాజీనామాకు దారితీసిన కారణాలను పరిస్థితులను వివరించారు. కాగా ఈ ఇద్దరూ మోదీని కలవడానికి వెళ్లినప్పుడు తమ సొంత వాహనాల్లో వెళ్లడం గమనార్హం. రాత్రి 7గంటలకు అశోక్, సుజనా ఇద్దరూ మీడియాతో మాట్లాడనున్నారు.
కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్‌గజపతిరాజు, శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రిగా సుజనా చౌదరి ఉన్న విషయం తెలిసిందే. 2014 మే 26న మంత్రిగా అశోక్ గజపతి, నవంబర్ 9న సుజనా చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ప్రధానితో సుమారు 10 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. అనంతరం వీరిద్దరూ ఈ సాయంత్రం 6.45 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. మోదీ అందుబాటులో లేకపోవడంతో కాస్త ఆలస్యంగా రాజీనామా లేఖలను సమర్పించారు. తొలుత సుజనా చౌదరి ఇంటికి వెళ్లిన అశోక్ గజపతిరాజు ఆయనతో కలిసి కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లారు. మోదీతో కొద్దిసేపు మాట్లాడి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలో పరిస్థితులను, తాము రాజీనామాలు చేసేందుకు దారితీసిన పరిస్థితులను వివరించినట్లు సమాచారం.
నిన్న సాయంత్రం కేంద్ర ఆర్థికశాఖమంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వెనువెంటనే సీఎం చంద్రబాబు ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్, మంత్రులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపిన తర్వాత బుధవారం అర్ధరాత్రి కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఉదయమే తమ రాజీనామా పత్రాలను తీసుకొని పార్లమెంట్ వద్దకు చేరుకున్న అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం వేచిచూశారు. అయితే ప్రధాని రాజస్థాన్ పర్యటకు వెళ్లడంతో సాధ్యపడలేదు. ఈ సాయంత్రం 4.30గంటల సమయంలో దిల్లీకి చేరుకున్న ప్రధాని నేరుగా సీఎం చంద్రబాబుకు ఫోన్‌చేసి సుమారు 20 నిమిషాలు మాట్లాడారు.