ఈనెల 20 నుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, బీటెక్ రవి- ఇద్దరూ కడపలోని జడ్పీ ప్రాంగణంలో దీక్షకు దిగారు. వైద్యపరీక్షలు నిర్వహించిన రిమ్స్ వైద్యులు.. ఇద్దరి ఆరోగ్యం ప్రమాదకరంగా ఉన్నట్లు హెచ్చరించారు. ప్రధానంగా బీటెక్ రవి పరిస్థితి బాగోలేదని వివరించారు. పరిస్థితిని అంచనా వేసి తదనుగుణ చర్యలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మంత్రి గంటా శ్రీనివాసరావును కడపకు పంపించారు. ఆయన బుధవారం ఉదయం నుంచి జిల్లా ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమావేశమయ్యారు. చివరగా పోలీసులు 6 గంటల సమయానికి రవి దీక్షను భగ్నం చేశారు. అయితే సీఎం రమేష్ దీక్ష ఇంకా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో, ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం ఎంపీలు, రకరకాల పద్ధతిలో కేంద్రం పై ఒత్తిడి తీసుకువవచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భగంగా, ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, రమేష్ చేస్తున్న దీక్ష, రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష ప్రధానికి తెలపటానికి, ఆయన అపాయింట్మెంట్ అడిగారు తెలుగుదేశం ఎంపీలు. అయితే, అయితే అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ప్రధాని తిరస్కరించారు. ప్రధాని మిమ్మల్ని కలిసేందుకు టైం లేదని, ఇప్పుడు అపాయింట్మెంట్ కుదరదు అంటూ మన ఎంపీలకు తేల్చి చెప్పారు. దాంతో కాసేపట్లో ఏపీ భవన్లో టీడీపీ ఎంపీలు సమావేశంకానున్నారు. ఉక్కుశాఖ మంత్రిని మరోసారి కలిసి, చంద్రబాబు రాసిన లేఖను టీడీపీ ఎంపీలు అందజేయనున్నారు.
మరో పక్క కడపలో దీక్ష చేస్తున్న శిబిరం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, కర్నూలు, అనంతపురం జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరలివచ్చి దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. మంత్రులు, నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష నేత జగన్‌పై దుమ్మెతి పోశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో జనాలు దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం ప్రకటించారు. కడప నారాయణ జూనియర్ కళాశాల, జమ్మలమడుగు ఎస్వీ కళాశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు భారీగా హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. తెదేపా సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు సాగాయి. మధ్యాహ్నం నుంచి దీక్షాశిబిరానికి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. దీక్షాశిబిరానికి ఇరువైపులా రెండు అంబులెన్స్‌లు ఉంచడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠలో అటు కుటుంబీకులు, ఇటు కార్యకర్తలు, శ్రేణులుండిపోయారు. సాయంత్రం సుమారు 200 మంది పోలీసుల వరకు శిబిరం వద్దకు చేరుకుని పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన బీటెక్ రవిని అంబులెన్స్‌లోకి చేర్చి రిమ్స్‌కు తరలించారు.