కడప ఉక్కుపై కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ చేతులెత్తేశారు. ‘నా చేతుల్లో ఏమీ లేదు’ అంటూ నిస్సహాయత వ్యక్తం చేశారు. ‘‘త్వరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నాకూ ఉంది. మా వాళ్లు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఏవీ జరగాల్సిన పద్ధతుల్లో జరగడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. చివరికి... వారం రోజుల్లోపు ఈ ప్రాజెక్టుపై పత్రికా ప్రకటన జారీ చేస్తామని హామీ ఇచ్చారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఒత్తిడి పెంచేందుకు టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, కొనకళ్ల నారాయణ, జేసీ దివాకర్ రెడ్డి, తోటా సీతారామలక్ష్మి, నిమ్మల కిష్టప్ప, పండుల రవీంద్ర బాబు, కేశినేని నాని, టీజీ వెంకటేశ్, గల్లా జయదేవ్ శనివారం ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్తో సమావేశమయ్యారు. ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
‘‘ఈ అంశాన్ని త్వరగా తేల్చాలని మా వాళ్లకు కూడా చెబుతున్నాను. మెకాన్ సంస్థ ఎందుకో చాలా నెమ్మదిగా పనిచేస్తోంది. నివేదికను త్వరగా సిద్ధం చేస్తారా లేదా అని నేను కూడా మెకాన్ను గట్టిగా అడిగాను’’ అని తెలిపారు. మెకాన్ సంస్థ కేంద్ర ఉక్కు శాఖ పరిధిలోనిదేనని ఎంపీలు గుర్తు చేశారు. త్వరగా నివేదిక తెప్పించండి అని కోరారు. చాలా సార్లు చెప్పానని, మరోసారి సంస్థ అధికారులతో సమావేశమవుతానని బీరేంద్ర బదులిచ్చారు. మరోవైపు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) సంస్థ ఈక్విటీ రూపంలో పెట్టుబడులు పెట్టే అంశంతో పాటు ఐదు సమస్యలు ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించినట్లు తెలిసింది.
‘‘మీరు సీనియర్ నాయకులు. మీకు అన్నీ తెలుసు. ఇప్పటికే చాలాసార్లు వచ్చి మిమ్మల్ని కలిశాం. ఇంకా ఎంత కాలం వేచిచూడాలి! ప్రతీసారి రావాలంటే మాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది’’ అని సుజనాచౌదరి అన్నారు. నాలుగైదు రోజుల్లో కడప ఉక్కు పరిశ్రమపై పత్రికా ప్రకటన చేస్తామని కేంద్రమంత్రి బీరేంద్రసింగ్ హామీ ఇవ్వగా... అదే మీడియాకు చెప్పాలని ఆయనను ఎంపీలు కోరారు. దానికి ఆయన అంగీకరించలేదు. ‘నేను మీడియాతో మాట్లాడను. గతంలో మాట్లాడినప్పుడే తప్పుడు సంకేతాలు వెళ్లాయి. మళ్లీ ఆ పొరపాటు చేయను. మీడియాతో వద్దే, వద్దు’ అన్నట్లు తెలిసింది. ఒక కేంద్ర మంత్రి ఇంత నిస్సహాయతలో ఉన్నారంటే, మోడీ-షాలు ఎలాంటి ఒత్తిడి తెస్తున్నారో అర్ధమవుతుందని, ప్రజలే సరైన బుద్ధి చెప్తారని టిడిపి ఎంపీలు అన్నారు.