జగన్ కేబినెట్లో మొత్తం 25 మందితో మంత్రి వర్గం కొలువుతీరనుంది. మంత్రివర్గంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉండబోతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులకు ఈ డిప్యూటీ సీఎం పదవులు కేటాయించారు. తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనపై తెలుగు దేశం పార్టీ స్పందించింది. తన కేబినెట్లోకి ఎవర్ని తీసుకోవాలో నిర్ణయించుకునే విశేషాధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకరన్ అన్నారు. అర్హులైన వారిని మంత్రులుగా నియమించే అధికారం సీఎంకు ఉంటుందని ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థతో చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త ప్రభుత్వం పనిచేయాలని తాము భావిస్తున్నామన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పార్టీ వ్యవహరిస్తుందని పునరుద్ఘాటించారు.
డిప్యూటీ సీఎంలలో మొదటిగా వినిపిస్తున్నపేరు రాజన్న దొర. ఇయన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సాలూరు నియోజవర్గం. సీనియారిటీ, సామాజిక వర్గం, వరుసగా ఆయన విజయాలు సొంతం చేసుకోవడం.. ఇవన్నీ రాజన్న దొరకు కలిసి వచ్చాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆయన జగన్‌తోనే ఉన్నారు. రెండో డిప్యూటీ సీఎంగా ఆళ్ల నాని ఎంపికయ్యారు. కాపు వర్గానికి చెందిన వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లా నుంచి కేబినెట్లో డిప్యూటీ సీఎంగా ఎంపికయ్యారు. ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన పార్టీకి వీర విధేయుడు. వైఎస్ కుంటుంబంతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. జిల్లా అధ్యక్షుడిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో నానికి మంచి పట్టుంది.
మూడో డిప్యూటీ సీఎంగా పార్థసారధి ఎంపికయ్యారు. ఈయన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సామాజిక సమతుల్యంలో భాగంగా ఈయనకు డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కింది. పార్థసారథి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. వైఎస్ హయాంలో కూడా ఈయన మంత్రిగా పనిచేశారు. ఆయనకు రాజకీయ అనుభవం ఉంది. మంచి వాక్చాతుర్యం ఈయన సొంతం. ఇవన్నీ పార్థసారథికి కలిసొచ్చాయి. పెనమలూరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగో డిప్యూటీ సీఎంగా మేకతోటి సుచరిత ఎంపికయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ఈమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావం నుంచి కొనసాగుతున్నారు. జగన్ కుటుంబానికి సుచరిత విధేయురాలు. ఎస్సీ విభాగంలో ఆమెకు డిప్యూటీ సీఎం పదవి వరించింది. ఐదో డిప్యూటీ సీఎంగా అంజాద్ భాషా ఎంపిక అయ్యారు. సొంత జిల్లా మైనారిటీ నేత అయిన భాషను జగన్ ఎంపిక చేశారు. కడప నుంచి ఆయన వరుసగా రెండోసారి విజయం సాధించారు. మైనారిటీ వర్గానికి చెందిన నేత కావడంతో ఆ వర్గానికి కూడా పెద్ద పీట వేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. వైఎస్ కుటుంబానికి భాషా కొన్నేళ్లుగా వీర విధేయుడు. శనివారం ఉదయం జరగనున్న మంత్రుల ప్రమాణస్వీకారానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.