4.5 ఏళ్ళు అయినా, తన పాలన పై చెప్పుకో లేక, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పై కెసిఆర్, చాలా దివాలోకోరు భాష మాట్లాడుతూ, రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. అయితే, చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల పై తెలుగుదేశం పార్టీ మాత్రం, ఎక్కువగా రియాక్ట్ అవ్వలేదు. దీనికి కారణం లేకపోలేదు. కెసిఆర్ తన పరిపాలన మీద చెప్పుకోవటానికి ఏమి లేదు. గ్రామాల్లో ఎన్నికల ప్రచారాలకి వస్తే తరిమి తరిమి కొడుతున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు స్పందిస్తే, ఈ ఎన్నికలను మళ్ళీ తెలంగాణా - ఆంధ్రా భావోద్వేగం రగిలించి లబ్ది పొందటానికి కెసిఆర్ రెడీగా ఉన్నారు. అందుకే చంద్రబాబు నేను ప్రచారం కూడా చెయ్యను అని చెప్పారు. ఈ తరుణంలో కెసిఆర్ ఈ రోజు, చంద్రబాబుని రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు.
తెలుగుదేశం ఈ ట్రాప్ లో పడకుండా, తెలంగాణాలో జరిగే ఎన్నికలు, కెసిఆర్ 4.5 ఏళ్ళ పరిపాలన పైనే జరగాలని, ఆంధ్రా - తెలంగాణా పై కాదని, జాగ్రత్తగా స్పందించింది. కేసీఆర్ నిజామాబాద్ సభలో వాడిన భాష అభ్యంతరకరమని ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదరావు అన్నారు. ఎన్నికలు వస్తే కేసీఆర్ ఎలా మాట్లాడతారో అందరికీ తెలిసిందేనని, ఇదంతా ఊహించిందేనని ఆయన అన్నారు. నిజామాబాద్‌లో జరిగిన సభలో కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన కేసీఆర్ ఏదో విధంగా ప్రజలను రెచ్చగొట్టి సెంటిమెంట్‌తో లబ్దిపొందేందుకు చూస్తున్నారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నాలుగున్నరేళ్ల కాలంలో ఏం చేసిందీ... ప్రజలు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తీర్పు ఇస్తారని డొక్కా పేర్కొన్నారు.
ప్రజలు ఏం తీర్పు ఇస్తారో.. దానిపై దృష్టి పెట్టాలని.. తన వైఫల్యాలను పక్క రాష్ట్రంపై ఆపాదించి, చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదని, అది ఓటమిని అంగీకరించడమేనని ఆయన అన్నారు. 7 మండలాలను చంద్రబాబు గుంజుకున్నారని కేసీఆర్ తిట్టడం సరికాదని, 7 మండలాలు ఏపీలో కలపాలని కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చేసిందని డొక్కా మాణిక్యవరప్రసాదరావు చెప్పారు. ఆ సమయంలో కేసీఆర్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన ప్రశ్నించారు. విభజన సమయంలో అప్పులు ఏపీకి ఇచ్చి, తెలంగాణకు ఆస్తులు ఇచ్చారని అప్పుడు ఆంధ్రా ప్రజలు ఏం మాట్లాడలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. వైఫల్యాలను చంద్రబాబుపైకి నెట్టడం సరికాదని ఆయన అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు తగిన విధంగా బుద్ది చెబుతారని మాణిక్య వరప్రసాదరావు అన్నారు.