ఫిబ్రవరి 28, 1999న మైక్రోసాఫ్ట్ డెవలప్ మెంట్ కేంద్రాన్ని, నాటి సీఎం చంద్రబాబునాయుడు, బిల్ గేట్స్ కలిసి ప్రారంభించారని, అది జరిగిసరిగ్గా 21 సంవత్సరాలైందని, నాడు ప్రారంభించిన ఆ కేంద్రం, నేడు కనిపిస్తున్నసైబరాబాద్ నగర నిర్మాణానికి బీజం వేసిందని టీడీపీనేత, ఆపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గురజాల మాల్యాద్రి తెలిపారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సైబరాబాద్ ద్వారా నేడు 13లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని, లక్షకోట్ల పైబడి ఐటీ ఎగుమతులను నేడున్న ప్రభుత్వం ఎగుమతి చేస్తోందంటే, అందుకుకారణం నాడు చంద్రబాబు వేసిన బీజమేనని మాల్యాద్రి స్పష్టంచేశారు. సైబరాబాద్ అభివృద్ధి ద్వారానే నేడు తెలంగాణ ప్రభుత్వానికి 60 శాతం వరకు ఆదాయం వస్తోందన్నారు. ఆనాడు చంద్రబాబు నాటిన మైక్రోసాఫ్ట్ డెవలప్ మెంట్ కేంద్రమనే చిన్నమొక్క, నేడు మహావృక్షంగా మారిందని, అందుకు కారణం చంద్రబాబుకు ఉన్న దూరదృష్టేనని టీడీపీనేత కొనియాడారు. దేశంలోనే ఐటీరంగంలో హైదరాబాద్ 4వస్థానంలో ఉండటానికి కూడా చంద్రబాబు దూరదృష్టే కారణమైందన్నారు. హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ చంద్రబాబు ఘనతేనని, తెలంగాణ ఐటీశాఖామంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ వ్యాఖ్యానించారని, చంద్రబాబునాయుడు తన సర్వశక్తులు ఒడ్డి, ఆ సంస్థను తీసుకొచ్చారనికూడా ఆయన చెప్పడం జరిగిందన్నారు. (కేటీఆర్ వ్యాఖ్యల వీడియోను ఈ సందర్భంగా విలేకరులకు ప్రదర్శించారు). (మైక్రోసాఫ్ట్ సీఈవో నాదెళ్ల సత్య కూడా చంద్రబాబు పడినకష్టాన్ని, రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు తీసుకురావడానికి ఆయన చేసిన కృషిని కొనియాడిన వీడియోనుకూడా చూపడం జరిగింది.)

హైదరాబాద్ కు దీటుగా అభివృద్ధి చెందిన సైబరాబాద్ ను చూడటానికి ఇప్పుడు రెండుకళ్లు చాలడంలేదని, ఆనాడు చంద్రబాబు అక్కడ హైటెక్ సిటీని నిర్మిస్తే, నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వై.ఎస్. దాన్ని తప్పుపడుతూ నోటికొచ్చినట్లుగా విమర్శించాడన్నారు. దూరదృష్టి కలనేతగా చంద్రబాబుచేసిన కృషి ఫలితంగా సైబరాబాద్ సాక్షాత్కరించిందన్నారు. సైబరాబాద్ సృష్టించిన తన అనుభవంతో, అన్యాయంగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు అమరావతికి అంకురార్పణ చేయడం జరిగిందన్నారు. రూపాయి ఖర్చులేకుండా రైతుల త్యాగంతో 34వేల ఎకరాలను సేకరించి, రూ.10వేలకోట్ల వరకు ఖర్చుచేసి, గడచిన ఐదేళ్లలో రాజధానిని నిర్మించడం జరిగిందని మాల్యాద్రి వివరించారు. చంద్రబాబు పాలనలోనే అమరావతి కేంద్రంగా ఎస్ ఆర్ ఎం ‍యూనివర్శిటీ, నిట్, అమృత వంటి విద్యాసంస్థలు ఏర్పడ్డాయన్నారు. సింగపూర్ అంకుర పరిశ్రమల సంస్థను కూడా అమరావతిలో ఏర్పాటుచేసేలా ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలను, జగన్ అధికారంలోకి రాగానే రద్దుచేశాడని, సింగపూర్ అంకుర పరిశ్రమల సంస్థను కూడా సాగనంపాడన్నారు. సింగపూర్ అంకురపరిశ్రమల ఏర్పాటు ఒప్పందం అమలైఉంటే, రాష్ట్రంలోకి రూ.50వేలకోట్ల పెట్టుబడులతోపాటు, 12లక్షల 50వేల ఉద్యోగాలు కూడా వచ్చిఉండేవన్నారు.

అమరావతి అభివృద్ధికి అతిముఖ్యమైన సింగపూర్ అంకురపరిశ్రమల ఒప్పందం ద్వారా, రాష్ట్రానికి 60శాతం వరకు ఆదాయం వచ్చి ఉండేదని, అమరావతి కేంద్రం రూ.2లక్షలకోట్ల ఆస్తి ప్రభుత్వానికి లభించి ఉండేదని, ఇవేవీ ఆలోచించకుండా జగన్ తన అజ్ఙానంతో వాటిని తరిమేశాడని మాల్యాద్రి మండిపడ్డారు. చంద్రబాబు దూరదృష్టితో చేసిన ఆలోచనను, తన స్వార్థంకోసం, విశాఖలో తనకున్న భూములను అమ్ముకోవడం కోసం, బీచ్ శాండ్ వ్యాపారం కోసం జగన్ నాశనం చేశాడన్నారు. జగన్ తరిమేసింది సింగపూర్ అంకుర పరిశ్రమల సంస్థలను కాదని, 13జిల్లాల, 175 నియోజకవర్గాల అభివృద్ధి మూల కేంద్రాన్నని గురజాల తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చిన 9నెలల్లోనే రూ.లక్షా 80వేలకోట్ల విలువైన పరిశ్రమలన్నీ పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పడానికి, ఒక ఆంధ్రుడిగా సిగ్గుపడుతున్నానని మాల్యాద్రి చెప్పారు. చంద్రబాబు ఓటమి, జగన్ గెలుపుకారణంగా రాష్ట్రం అనేకవిధాలుగా నష్టపోయిందన్నారు. భావితరాల భవిష్యత్ ను, రాష్ట్ర పురోగతిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు దూరదృష్టితో చేసిన ఆలోచనలను చిదిమేయడం ద్వారా జగన్ రాష్ట్రానికి దుష్ఫలితాలే మిగిల్చాడన్నారు. రాష్ట్ర యువత, విద్యార్థులు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని ఒకేరాష్ట్రం – ఒకే రాజధాని నినాదంతో ముందుకుసాగాలని, అమరావతిని కాపాడుకోవడానికి పోరుబాట పట్టాలని మాల్యాద్రి పిలుపునిచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read