తెలుగుదేశం పార్టీ నేతలను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తెదేపా మాజీ ఎంపీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ దుర్మరణం నుంచి తేరుకోక ముందే మరో కీలక నేత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న విశాఖ మాజీ ఎంపీ, గీతం విద్యాసంస్థల అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి హఠాన్మరణం చెందడటం పార్టీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురి చేసింది. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మొదలుకొని ఎంవీవీఎస్ మూర్తి వరకు నలుగురు కీలక నేతలు రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందడం వారి కుటుంబాలకు శోకాన్ని.. తెదేపాకు తీరని లోటును మిగిల్చాయి.
2002లో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న ప్రముఖ తెదేపా నేత జీఎంసీ బాలయోగి సైతం ప్రమాదంలోనే మృతిచెందారు. కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో దుర్మరణం చెందారు. ఇటీవలే మావోయిస్టుల చేతిలో విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ దారుణ హత్యకు గురయ్యారు. ఆ విషాదం నుంచి పూర్తిగా బయటపడకముందే అదే జిల్లాకు చెందిన ఎంవీవీఎస్ మూర్తి రోడ్డుప్రమాదంలో మృతిచెందడంతో విశాఖ జిల్లా తెదేపాలో విషాదం నెలకొంది. కొద్ది రోజుల వ్యవధిలోనే కీలక నేతలంతా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
నందమూరి హరికృష్ణ మరణం నుంచి తెదేపా శ్రేణులు పూర్తిగా కోలుకోకముందే ఈ తెల్లవారు జామున మరో దుర్వార్త వినాల్సి వచ్చింది. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం విశ్వవిద్యాలయం అధినేత, తెదేపా ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మృతిచెందారు. మంగళవారం కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. గీతం విద్యా సంస్థల అధినేతగా, పార్టీ ఎంపీగా మూర్తి విశేష సేవలందించారు. తెదేపా సంక్షోభంలో ఉన్న సమయంలో పార్టీకి ఆయన అండగా నిలిచారు.