తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు వల్ల, ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. అన్నీ వదులుకుని ఆంధ్రప్రదేశ్ ప్రయాణం మొదలు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చినా, ఒక్కటీ నెరవేరటం లేదు. సాటి తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణా, మన పోరాటంలో కలిసి రావటం లేదు. పోయిన సారి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం పై అవిశ్వాస తీర్మానం పెడితే, అన్నాడీయంకే ఎంపీలతో కలిసి, అవిశ్వాస తీర్మానం రాకుండా, బీజేపీకి లబ్ది చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎంత సహకరించమన్నా, సహకరించ లేదు. ఇక్కడేమో, హైదరాబాద్ సెట్టేలర్ల ఓట్లు కోసం, ప్రత్యేక హోదాకు సహకరిస్తాం అంటారు, పార్లమెంట్ కు వెళ్తే మోడీకి సహకరిస్తారు. ఇదీ కెసిఆర్ పార్టీ వరుస.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి, కేంద్రం పై ఏ విధమైన పోరాటం చెయ్యదు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, కలిసి రండి అన్నా, మోడీకి ఎక్కడ కోపం వస్తుందో అని, అక్కడ కూడా కలిసి రాలేదు.
అయితే, ఈ నెల 18 నుంచి మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మళ్ళీ తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెడుతుంది. కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనకు ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తాము చేయబోతున్న పోరాటానికి, మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకుల్ని తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలుస్తున్నారు. కాంగ్రెస్సేతర, భాజపాయేతర పార్టీలను కలసి మద్దతు కోరాలని ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయించారు. దాని ప్రకారం మొత్తం 18 ప్రధాన పార్టీల నాయకుల్ని తెదేపా ఎంపీలు కలవనున్నారు. మొత్తం తెదేపా ఎంపీల్ని ఆరు బృందాలుగా విభజించారు. ఒక్కో బృందానికి కొన్ని పార్టీల్ని కేటాయించారు.
ఇందులో భాగంగా ఎంపీల బృందం ఆదివారం హైదరాబాద్‌లో తెరాస ఎంపీలు కె.కేశవరావు, జితేందర్‌రెడ్డిలను కలసి తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ఈ బృందంలో ఎంపీ నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, శ్రీరాం మాల్యాద్రి ఉన్నారు. ఈ బృందానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు సారథ్యం వహించాల్సి ఉండగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో వై.ఎస్.చౌదరి సారథ్యంలో వెళ్లి తెరాస
నాయకుల్ని కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంటులో అనుసరించబోయే వ్యూహం గురించి ఏపీ తెదేపా ఎంపీలు తెలిపారు. ఈ సమావేశాలే చివరివి కావచ్చని, ఇప్పుడే కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. గతంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా దానిపై చర్చ రాలేదని, ఈసారి ఎలాగైనా దానిని ప్రవేశపెట్టి, చర్చకు అనుమతించేలా పోరాటం చేస్తామని చెప్పారు. ఏపీతో పాటు తెలంగాణపైనా కేంద్రం వివక్ష చూపుతున్నందున ఇద్దరం కలిసి పోరాడుతామని ప్రతిపాదించారు. దీనిపై కేశవరావు మాట్లాడుతూ, తమ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరి ఈసారైనా కెసిఆర్ సహకరిస్తారో లేదో చూడాలి.