నిన్న చంద్రబాబు అమరావతి పర్యటనలో, ఆయన కాన్వాయ్ పై రాళ్ళతో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు స్థాయి నేత, జెడ్ ప్లస్ బద్రత ఉన్న నేత పై, రాళ్ళ దాడి కావాలని జరిగితే, రాష్ట్ర డీజీపీ మాత్రం, ఎవరికైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ఏమి చేస్తారో చూద్దాం అని వదిలాం అంటూ చెప్పటం పై, తెలుగుదేశం పార్టీ సీరియస్ అయ్యింది. ఢిల్లీ స్థాయిలో చెక్ పెట్టే వ్యూహం పన్నింది. డీజీపీ వ్యాఖ్యలపై కేంద్రహోమ్ సెక్రటరీకి ఫిర్యాదు చెయ్యాలని, పార్లమెంట్ లో కూడా విషయం లేవనెత్తాలని, హోం మంత్రి అమిత్ షా కు కూడా ఫిర్యాదు చెయ్యాలని, టీడీపీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్‍లో కూడా బస్సు పై దాడి అంశాన్ని ప్రస్తావించాలని ఎంపీలకు సూచన చేసారు. దాడి పై తుళ్లూరు పీఎస్‍లో కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుచేసింది. ఈ రోజు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. రాజధాని పర్యటన, బస్సుపై దాడి, డీజీపీ వ్యాఖ్యలపై చర్చ చేసారు.
వర్ల రామయ్య మాట్లాడుతూ, పోలీస్‌వ్యవస్థలో డీజీపీ సుప్రీం అయినప్పటికీ, ఆయనతోపాటుగా ఆరుగురు అడిషనల్ డైర్టెర్స్ ఆఫ్ జనరల్‌పోలీసులు ఉన్నారని, చంద్రబాబు పర్యటనలో పోలీస్‌శాఖ వ్యవహరించిన తీరు సరిగా ఉందో లేదో వారే సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్‌చేశారు. ప్రతిపక్షనేతపై జరిగిన దాడికి సంబంధించి సమాధానం చెప్పే, అర్హతను తన దృష్టిలో డీజీపీ కోల్పోయాడని వర్ల తెలిపారు. మాజీముఖ్యమంత్రి, జెడ్‌ప్లస్ భద్రత ఉన్నవ్యక్తి పర్యటిస్తుంటే, సెక్షన్-30 అమలుచేయకుండా నిరసనలకు ఎలా అనుమతించారో ఆరుగు రు అడిషనల్ డీజీపీలు సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుపై దాడిచేయడానికే వైసీపీవారికి పోలీసులు అనుమతి ఇచ్చారా అని వర్ల నిలదీశారు. డీజీపీ చర్యపై ఢిల్లీస్థాయి లో నిలదీస్తామని, ఆయనకు పైనున్నవ్యవస్థ తలుపుతడతామని రామయ్య స్పష్టంచేశారు.
రైతులకు, రైతుకూలీలకు న్యాయం చేయడానికి, అమరావతి నిర్మాణంపై రాష్ట్రప్రభుత్వానికి ఉన్న చులకనభావాన్ని తొలగించడానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని పర్యటనకు వెళ్లడం జరిగిందని ఆపార్టీ ఎమ్మెల్యే నిమ్మలరామానాయుడు చెప్పారు.
చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై, రాళ్లు, చెప్పులేయడాన్ని సమర్థిస్తూ డీజీపీ మాట్లాడటం దారుణమన్నారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా నిరసన వ్యక్తంచేయడానికి వైసీపీ వారికి అనుమతిచ్చామని చెబుతున్న డీజీపీ, ప్రతిపక్షనేత వాహనంపై చెప్పులు, రాళ్లు, కర్రలు వేయడాన్ని సమర్థిస్తున్నారా అని నిమ్మల ప్రశ్నించారు. పోలీసుల చేతిలో ఉండాల్సిన లాఠీ వైసీపీ కార్యకర్తల చేతికెలా వచ్చిందో డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. భావప్రకటన స్వేచ్ఛ అనేది వైసీపీవారికి మాత్రమే ఉండదని, రాష్ట్రప్రభుత్వం చేతిలో దగాపడిన వారికి కూడా ఉంటుందనే విషయాన్ని పోలీస్‌బాస్ తెలుసుకోవాలన్నారు.