ఎన్నికలు ముగిసిన తరువాత ఓటింగ్ సరళిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దృష్టి సారించారు. అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా పోలైన ఓట్లపై ఒక అంచనాకు వచ్చారు. సెగ్మెంట్‌లలో బూత్‌ల వారీగా పోలైన ఓట్ల వివరాలతో కూడిన 17(సీ) ద్వారా సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి తీసుకున్నారు. ప్రతి సెగ్మెంట్‌లో బూత్‌ల వారీగా మొత్తం ఓట్లు? పోలైన ఓట్లు? పురుషులు, మహిళలు? ఎవరి శాతమెంత? అనేది ఈ 17(సీ)లో ఉంటుంది. దీని ప్రకారం బూత్‌ల వారీగా టీడీపీకి వచ్చే ఓట్లెన్ని? ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయి? అనేది అంచనా వేశారు. గత ఎన్నికలలో వచ్చిన ఓట్లతో ప్రస్తుత ఎన్నికలలో వచ్చే ఓట్లను పోల్చి లెక్కలు వేశారు. పార్టీకి బలమైన బూత్‌లలో పోల్ శాతం పెరిగితే అనుకూలంగా ఉంటుందని అంచనా మేరకు లెక్కలు కట్టారు.
పార్టీకి పట్టున్న గ్రామాల్లో ఎక్కువగా పోలైన బూత్‌ల వివరాలు తీసుకున్నారు. అదే సమయంలో ప్రత్యర్థికి అనుకూలంగా ఉండే బూత్‌లలో పోలైన ఓట్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రెండింటికీ మధ్య తేడా ఎంత? దాని ప్రకారం గెలుపుపై అంచనాలు వేశారు. అయితే ఈ నెల 11న పోలింగ్ సరళి ప్రధానంగా మధ్యాహ్నం తరువాత మహిళలు ఓటింగ్‌కు వచ్చారు. ఎంత రాత్రయినా సరే వుండి, ఓటేసి వచ్చారు. దీనిపై తెలుగుదేశం అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తరువాత ప్రభుత్వం అమలు చేసిన పసుపు కుంకుమ పథకం, పింఛను పెంపు టీడీపీకి అనుకూలంగా ఉంటాయని గట్టిగా నమ్ముతున్నారు. అందుకు అనుగుణంగానే మహిళలు ఓటేయడానికి పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన విషయం గుర్తు చేస్తున్నారు. అదే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని బూత్‌లవారీగా పోలైన ఓట్లను విశ్లేషించారు.
ఇదే సమయంలో అధిష్ఠానం కూడా ఓటింగ్ సరళిపై అభ్యర్థుల నుంచి నివేదికలు కోరింది. ఎన్నికలతో సరిపెట్టకుండా పోలైన ఓట్ల శాతం మేరకు పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. అందుకే నియోజకవర్గంలో బూత్‌లవారీగా ఓట్ల వివరాలతో పంపాలని సూచించింది. ప్రతి బూత్ ఏజెంట్ సంతకం తీసుకుని నివేదిక పంపాలని ఆదేశించింది. అంటే ఆయా బూత్‌లలో టీడీపీకి వచ్చే ఓట్లు ఎన్ని ఉంటాయన్నదానిపై ఏజెంట్లకు అంచనా ఉంటుంది. దాని ప్రకారం బూత్‌లలో ఓట్లు పెరిగాయా? లేదా తగ్గాయా? ఒకవేళ తగ్గితే కారణాలేంటి? అనేది ఏజెంట్లకు తెలుస్తుంది. అందుకు ఏజెంట్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని పంపాలని అభ్యర్థులకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చాయి.