2019 ఎన్నికల్లో ప్రత్యర్ధులకు ఏ మాత్రం అవకాసం ఇవ్వకుండా, తెలుగుదేశం పార్టీ పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలకు తెర తీస్తోంది. 2019 ఎన్నికల నాటికి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గ్రామస్థాయి నుంచి అందరికీ తెలిసే విధంగా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ బలోపేతం పై అధిష్టాన వర్గం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే గ్రామస్థాయిలో సైకిల్ యాత్రలకు శ్రీకారం చుట్టనుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఏ విధంగా అయితే ప్రజలకు చేరువయ్యారో అదే పంథాలో ఈ పర్యాయం ప్రజల్లోకి చొచ్చుకుపోవడానికి ఈ యా త్ర ఎంతో దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ సైకిల్ యాత్రలకు మంత్రి లోకేష్ సారధ్యం వహించే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం లోకేష్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినప్పటికీ గ్రామ స్థాయిలో లోకేష్ ముద్ర పడాలంటే ఈ సైకిల్ యాత్ర ఉపకరిస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. గడచిన కొన్ని రోజులుగా వైఎస్ జగన్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలు ముందుకు వెళ్ళింది. ఈ కార్యక్రమాల్లో కొంత మంది ఎమ్మెల్యేలు సరైన రీతిన స్పందించ లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజలకు పూర్తి స్థాయిలో చేరు చకావాలంటే సైకిల్ యాత్ర దోహదపడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతీ నియోజకవర్గంలోనూ స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సైకిళ్ళ పై యాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని వెనువెంటనే అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.
ముఖ్యంగా పార్టీ క్యాడర్ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళినప్పుడే వారిలో జోష్ పెరుగుతుందని భావిస్తున్నారు. గడచిన మూడున్నరేళ్ళలో నామినేటెడ్ పదవులు వస్తాయని భావిస్తున్న తెలుగు తముళ్ళకి ఆ దిశగా ముఖ్యమంత్రి ఆడుగులు వేయక పోవడంతో నైరాశ్యానికి లోనవుతున్నారు. కార్యకర్తలతో నేరుగా మాట్లాడే అలవాటు ఉన్న ముఖ్యమంత్రికి కొంతమంది సీనియర్ కార్యకర్తలు ఎంత చేసినా ఉపయోగం ఉండటం లేదని, స్థానిక ఎమ్మెల్యేలు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని వాపోయినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్నికల వూహ్యాత్మక చర్యల్లో భాగంగా ఏడాదిన్నర మందుగానే నామీనేటెడ్ పదవుల పందేరం చేస్తేనే కార్యకర్తల్లో జోష్ వస్తుందని గుర్తించిన బాబు మార్చి నెలాఖరులోగా రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పందారానికి తెర తీయనున్నారని తెలుస్తోంది. ఈసారి ఎమ్మెల్యేలు సిఫార్పు చేసిన వారికి కాకుండా పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న వారిని మాత్రమే ఆందలమెక్కించాలని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా మహిళా నాయకుల విషయంలో కూడా చంద్రబాబునాయుడు ఈసారి ఎన్నికల్లో పెద్దపీట వేసేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.