సమగ్ర ప్రాజెక్టు నివేదిక నివేదిక (డీపీఆర్) ఇవ్వకుండా, కృష్ణా బోర్డులో చర్చించకుండానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-పెన్నా అనుసంధానం మొదటిదశను చేపట్టడం పట్ల తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరి నుంచి పెన్నాకు నీటిని మళ్లిస్తున్నందున శ్రీశైలం నుంచి విడుదల చేసే నీటిలో రెండు రాష్ట్రాల మధ్య జరిగిన తాత్కాలిక కేటాయింపు నిష్పత్తిని మార్చాలని కోరింది. ప్రస్తుతం 66 శాతం ఆంధ్రప్రదేశ్‌కు, 34 శాతం తెలంగాణకు ఉంది. దీనిని 2019-20 నీటి సంవత్సరంలో 50 శాతానికి మార్చాలని, బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు దీనిని అమలు చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీఫ్ మురళీధర్ శుక్రవారం లేఖ రాశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా గోదావరి-పెన్నా అనుసంధానం మొదటి దశ చేపట్టింది. గోదావరి నదిపై చింతలపూడి నుంచి ప్రకాశం బ్యారేజి వద్ద హరిశ్చంద్రాపురానికి, అక్కడి నుంచి నాగార్జునసాగర్ కుడికాలువ కింద 9.61 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, లక్ష ఎకరాల గ్యాప్ ఆయకట్టుకు నీరివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 73 టీఎంసీల నీటిని మళ్లించడం దీని లక్ష్యం. ఈ పథకానికి రూ. 6,020.15 కోట్లతో ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది ఏపీ పునర్విభజన తర్వాత చేపట్టింది కాబట్టి ఎంత నీటిని మళ్లించేది కృష్ణా బోర్డు పరిశీలించాల్సి ఉంది. బోర్డుతోపాటు జలసంఘానికి, అపెక్స్ కౌన్సిల్‌కు ఏపీ డీపీఆర్‌ను అందజేయడం తప్పనిసరి. బోర్డు తక్షణం జోక్యం చేసుకోవాలి. "
"దీంతోపాటు కృష్ణా జలాల్లో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక వాటాలో మార్పు చేసి రెండు రాష్ట్రాలకు 50 శాతం చొప్పున కేటాయించాలి. గోదావరి నుంచి పెన్నాకు నీటిని మళ్లిస్తున్నందున ప్రస్తుతం మళ్లిస్తున్న కృష్ణా నీటితో అవసరం లేదు. 2015లో రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటా తాత్కాలికంగా నిర్ణయమైనప్పుడు తెలంగాణలోని కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నీటిని వినియోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నీటి సంవత్సరం నుంచి నీటి వాటాను చెరో సగం చొప్పున మార్చాలి’’ అని తెలంగాణ కృష్ణా బోర్డును కోరింది.