తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేసే విషయం పై చెప్పమంటే, గత నెల రోజులుగా ఒక్క మాట కూడా చెప్పలేదు పవన్ కళ్యాణ్. యుద్ధం అక్కడ జరుగుతుంటే, కత్తులు వచ్చి ఆంధ్రాలో తిప్పారు. తెలంగాణా ఎన్నికల గురించి ఎప్పుడు అడిగినా, అదిగో ఇదిగో అంటూ తప్పించుకుని వెళ్ళిపోయారు. తెలంగాణా ఎన్నికల్లో పోటీ అంటే ఎందుకు అంత భయమో, ఎవరి ఆదేశాలు రావాలో కాని, అటు పవన్, ఇటు జగన్ ఇద్దరూ చేతులు ఎత్తేసారు. జగన్ మోహన్ రెడ్డి ధైర్యం చేసి ఒక వారం ముందే, తెలంగాణాలో మా వల్ల కాదు, మా టార్గెట్ 2024 అని చెప్తే, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు తెలంగాణాలో నా వల్ల కాదు, నా టార్గెట్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి, ఇద్దరూ చేతులు ఎత్తేసారు.
నామినేషన్ ఆఖరి రోజు అయిన, ఆఖరి గంటలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ముందస్తు ఎన్నికలు వస్తాయని తాము ఊహించలేకపోయామనీ, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీని విరమించుకున్నట్లు జనసేన స్పష్టం చేసింది. 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని విధాలుగా ప్రణాళికలు రూపొందించుకున్నామనీ, కానీ అనూహ్యంగా ముందస్తు ఎన్నికలు రావడంతో తమ వ్యూహం మార్చుకున్నామని వెల్లడించింది. పార్లమెంట్ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని ప్రకటించింది. ఆ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నట్లు తెలిపింది.
తెలంగాణ ఎన్నికలపై పార్టీలోని నాయకుల సమావేశం జరిగిందని, శాసనసభ ఎన్నికల్లో కాకుండా షెడ్యూల్ ప్రకారం జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం జనసేన ఇప్పటి నుంచే సమయాత్తం అవుతుందని ప్రకటనలో స్పష్టంచేశారు. అయితే ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గత సంవత్సరం ఏప్రిల్ 2017న చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. "ఎన్నికల యుద్దం ఒక వేళ ముందస్తుగా వస్తే , జన"సేన" సిద్దమే." అంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో ట్వీట్ చేసారు. మరి ఇప్పుడు ముందస్తు వస్తే, మేము రెడీగా లేము అని చెప్తున్నారు అంటే, ఈయన, ఈయన సేన కబురులు మాత్రం, బాగా చెప్తారని తెలుస్తుంది. మొత్తానికి యుద్ధం తెలంగాణాలో, కత్తులు తిప్పేది ఆంధ్రాలో. ఇలాంటి వాళ్ళని ఏమని పిలవాలో, ప్రజలే చెప్పాలి.