విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అంటే, తెలంగాణా నేతలకు ఎంత కోపమో అందరికీ తెలిసిందే. 2014కి ముందు, తెలంగాణా నేతలు, ముఖ్యంగా తెరాస నేతల ఆగడాలను, ఎదురుకునే వారు. ఆ కోపంతో, రాజగోపాల్ అంటే, తెరాస నాయకులు మండి పడే పరిస్థితి. అప్పట్లో, తెలంగాణా వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని, అలాగే మాట మీద నిలబడి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్నా, అప్పుడప్పుడు వార్తల్లో వస్తూ ఉంటారు. దానికి కారణం రాజగోపాల్ సంస్థ చేసే రాజకీయ సర్వే. రాజగోపాల్ సర్వే అంటే 100 శాతం నిజం అవుతుంది అని రెండు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు నమ్ముతారు. అందుకే ఆయన్ను ఆంధ్రా ఆక్టోపస్ అని కూడా పిలుస్తారు.
గతంలో ఆయన సర్వేలన్నీ నూటికి నూరుపాళ్లు నిజం కావడంతో... ఆయన నుంచి సమాచారం తెలుసుకునేందుకు పలువురు తెలంగాణా నేతలు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందా, లేదా తెలుసుకోవాలని ప్రధాన పార్టీల అగ్ర నాయకులు ఆయనను సంప్రదిస్తున్నారు. వ్యక్తిగతంగా తాము విజయం సాధిస్తామా, లేదా సర్వే చేసి పెట్టాలని పలువురు అభ్యర్థులు అడుగుతున్నారు. వ్యాపారవేత్తలు, బడా కాంట్రాక్టర్లు ఎన్నికలప్పుడు అన్ని ప్రధాన పార్టీలకు ఎంతోకొంత విరాళాలు ఇస్తుంటారు. అయితే గెలిచే పార్టీతో ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి ఆ పార్టీ నాయకులకు ఎక్కువగా, ఓడిపోయే పార్టీకి తక్కువగా ఇస్తుంటారు. అలాంటివారు కూడా లగడపాటి అంచనా ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాబోయే ప్రభుత్వంలో కీలక పదవుల కోసం ప్రయత్నిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆయనను సంప్రదిస్తున్నారు. అయితే నామినేషన్ల ఘట్టం ముగిసిన వారం తర్వాతే తన సర్వే ప్రారంభమవుతుందని లగడపాటి చెబుతున్నారు. వ్యక్తిగతంగా ఒక్కో అభ్యర్థి గెలుపోటములపై సర్వే చేయబోమని, రాష్ట్ర స్థాయిలో మొత్తం ఫలితంపైనే తన సర్వే ఉంటుందని స్పష్టంచేస్తున్నారు. సర్వే ఫలితాలను డిసెంబరు 7న పోలింగ్ ముగియగానే సాయంత్రం 5 గంటలకు వెల్లడిస్తానని ఆయన తెలిపారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్ ఎన్నికలపైనా ఆయన సర్వే చేయిస్తున్నారు. సర్వేల్లో లగడపాటి ట్రాక్ రికార్డును బట్టి చూస్తే... ఎన్నికల ఫలితాల కోసం డిసెంబరు 11 వరకూ వేచి చూడనక్కర్లేదని, పోలింగ్ రోజునే ఫలితాలు కూడా వెల్లడవుతాయని భావించవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.