హైదరాబాద్ మాదాపూర్‌లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంపై వైసీపీ నేతల సూచన మేరకు తెలంగాణ పోలీసుల దాడికి సంబంధించి మొత్తం కుట్ర ఆంధ్రలోనే జరిగిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. బుధవారం గుంటూరు రూరల్ ఎస్సీపి కలిసి ఫిర్యాదు చేశాక.. ఎంపీ కనకమేడల రవీంద్ర విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో దొడ్డిదారిన విజయం సాధించాలనే దుర్బుద్ధితో వైసీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయన్నారు. దీనిలో భాగంగా దశాబ్దాలుగా టీడీపీ డేటాను నిర్వహిస్తున్న హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయంపై దాడి చేసేందుకు వైసీపీ నాయకులు కుట్ర పన్నారన్నారు. ఈ కుట్రలో తెలంగాణ పోలీసులు కూడా భాగస్వాములు అయ్యారన్నారు. డేటా మొత్తం తెలంగాణా పోలీసులే దొంగతనం చేసి, వైసీపీకి అందించారని చెప్పారు.
‘పథకం ప్రకారం గత నెల 23న అక్రమంగా ఐటీ గ్రిడ్స్ కార్యాలయంపై దాడి చేశారు. తెలంగాణ పోలీసులు మఫ్టీలో వెళ్లి దాడి చేసి టీడీపీ డేటాను సేకరించారు. ఉద్యోగులు వారికి సహకరించకపోవడంతో నలుగురిని అక్రమంగా నిర్బంధించారు. దీనిపై హైకోర్టులో హెబియ్‌సకార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో గత్యంతరం లేని పరిస్థితిలో వారిని కోర్టులో హాజరు పరిచారు. వారిని కేసులో సాక్షులుగా పేర్కొన్నారు. అంతేకాక ఖాళీ పేపర్లపై వీఆర్‌వోల సంతకాలను పెట్టించుకున్న పత్రాలు కూడా కోర్టు దృష్టికి రావడంతో హైకోర్టు వారికి చీవాట్లు పెట్టింది. ఈ మొత్తం వ్యవహారం వివాదాస్పదం కావడంతో గత్యంతరం లేక ఈ నెల 2న కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం తెలంగాణ పోలీసులకు కేసు నమోదు చేసే అధికారం లేదు. ఒకవేళ ఏపీ ప్రభుత్వ డేటా చోరీకి గురైతే కేసు నమోదు చేయాల్సింది ఏపీలో. సంబంధం లేకపోయినా కేవలం కుట్ర పూరితంగా చట్టాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను దుర్వినియోగం చేసి తెలంగాణ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారు. ఈ విధంగా సేకరించిన టీడీపీ డేటాను వైసీపీ నేతలకు అందించారు. వారు అందులో ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఫోన్‌లు చేసి ప్రలోభాలకు గురి చేశారు.
టీడీపీ డేటాను తస్కరించి పెద్ద సంఖ్యలో టీడీపీ ఓట్లను తొలగించేందుకు కుట్ర చేశారు. దానిలో భాగంగానే కుప్పలు తెప్పలుగా ఫామ్-7 దరఖాస్తులు వెల్లువెత్తాయి. పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలు ఏపీ రాజకీయాల గురించి పట్టించుకోవు. తెలంగాణ మాత్రం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోంది. జగన్ గవర్నర్‌ను కలవడం ఆ వెంటనే డేటా తస్కరణపై సిట్ వేయడం వంటివి చూస్తుంటే టీఆర్‌ఎస్, వైసీపీ, బీజేపీల కుట్ర స్పష్టంగా తెలిసిపోతోంది. ఈ మొత్తం కుట్రపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అంశాలు వెలుగు చూస్తాయి. కుట్రలో భాగస్వాములైన వైసీపీ నాయకులు, తెలంగాణ పోలీసులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం’ అని వెల్లడించారు. ఐపీసీ 120బి, 418, 420, 380, 409, 167, 177, 182 రెడ్‌విత్ 511, ఐటీ యాక్ట్ 66సీ, 67, 70 సెక్షన్ల కింద కేసునమోదు చేశారు. వైసీపీ నాయకులు, తెలంగాణ పోలీసులను నిందితులుగా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.