రాజధాని పరిధిలో మరో పది ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. మంత్రి లోకేష్ చేతులమీదుగా బుధవారం ప్రారంభం కానున్నాయి. వీటితో కలిపి విజయవాడ, గుంటూరు నగరాలు సహా రాజధాని ప్రాంతంలో మొత్తం వంద వరకూ ఐటీ కంపెనీలు కొలువుదీరాయి. ఈ కంపెనీల ద్వారా 936 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇప్పటికే 285 మందిని ఈ కంపెనీలు తీసుకున్నాయి. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం ఈ కంపెనీలను ప్రారంభిస్తారు. మంగళగిరి ఎన్ఆర్టీ టెక్‌పార్కులో ఆరు కంపెనీలు, విజయవాడలో రెండు కంపెనీలు, గన్నవరంలోని మేథా టవర్స్‌లో రెండు కంపెనీలు ప్రారంభం కానున్నాయి. ఈ 10 కంపెనీలను ఏపీఎన్ఆర్టీ భవన్ నుంచి లోకేశ్ ప్రారంభిస్తారు. నేరుగా ఐటీ విభాగం, అదే సమయంలో ఏపీఎన్ఆర్టీ, మరోవైపు ఎపిటా ఆధ్వర్యంలో ఐటీ, ఎలక్ర్టానిక్స్ కంపెనీలు రాష్ర్టానికి వచ్చేలా ప్రయత్నిస్తోంది.
ఈ కంపెనీల్లో అక్రుక్స్ ఐటీ డాటా సర్వీసెస్ 300 మందికి, నార్మ్ సాఫ్ట్వేర్ 150 మందికి, యలమంచిలి సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్ ద్వారా 200 మందికి, కేడ్‌ప్లయ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 90 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. ఇవి కాక విభర్‌టెక్ సొల్యూషన్స్, సీఎ్‌సఎస్ టెక్ సొల్యూషన్స్, హెడ్‌రమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెంటిస్ ఐటీ సొల్యూషన్స్, ఫ్రీమాంట్ ఐటీ సొల్యూషన్స్, ప్రొకొమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీలు రానున్నాయి. ఐటీ సొల్యూషన్స్, బీపీవో, మొబైల్ అప్లికేషన్ డెవల్‌పమెంట్, ఆన్లైన్ మార్కెటింగ్ తదితర రంగాల్లో ఈ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తాయని ఏపీఎన్ఆర్టీ సీఈవో రవికుమార్ వేమూరి తెలిపారు.
గన్నవరం మేథాటవర్స్‌లో 2లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండగా.. 90 శాతం నిండిపోయింది. 11వేల చదరపు అడుగుల విస్తీర్ణం మాత్రమే ఖాళీగా ఉంది. మేథాటవర్స్‌లో 12 కంపెనీలు నడుస్తుండగా.. 2వేల మంది వరకూ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాజధాని పరిధిలో ఐటీ కంపెనీల రాక జోరందుకోవడంతో.. మేథా టవర్స్‌కు పక్కనే ఆరు అంతస్తుల్లో మరో టవర్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇప్పటికే మూడు ఫ్లోర్ల నిర్మాణం పూర్తయింది. ఈ ఐటీ టవర్‌లో ఆరున్నర లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోనికి రానుంది. మరో రెండు మూడు నెలల్లో ఈ టవర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పనులను జోరుగా చేపడుతున్నారు. ఇవికాకుండా.. విజయవాడలోని ఆటోనగర్ ఇండ్వల్ టవర్, కె.బిజినెస్ సెంటర్, మహానాడులోని ఎం.కె.ప్రీమియం, గుంటూరు విద్యానగర్‌లోని ఐటీ టవర్‌లో ఐదు కంపెనీలు, మంగళగిరిలోని ఎన్ఆర్టీ టెక్‌పార్క్, ఐటీ పార్కుల్లో మరికొన్ని కంపెనీలు ఉన్నాయి.