ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు భవన నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. హైకోర్టు నిర్మాణ పనులు దక్కించుకునేందుకు షాపూర్జీ-పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్‌సీసీ సంస్థలు పోటీ పడ్డాయి. మిగతా రెండు సంస్థలకంటే తక్కువ మొత్తానికి బిడ్ దాఖలు చేసిన షాపూర్జీ సంస్థ పనులు దక్కించుకుంది. హైకోర్టు నిర్మాణానికి రూ.996 కోట్ల అంచనా వ్యయంతో సీఆర్‌డీఏ టెండర్లు పిలవగా.. షాపూర్జీ సంస్థ 4.3 శాతం ఎక్కువ మొత్తానికి బిడ్ దాఖలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా.. హైకోర్టు భవనం స్ట్రక్చర్‌ను మాత్రం షాపూర్జీ సంస్థ నిర్మిస్తుంది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి పనులకు విడిగా టెండర్లు పిలుస్తారు.
భవనాన్ని బౌద్ధ స్థూపాన్ని పోలిన ఆకృతిలో నిర్మిస్తున్నారు. లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ ఆకృతిని రూపొందించింది. జీ+7 విధానంలో నిర్మిస్తారు. మొత్తం 12 లక్షల చ.అ. నిర్మితప్రాంతం ఉంటుంది. సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్‌లను వాహనాలు నిలిపేందుకు కేటాయిస్తారు. మరో పక్క, శాసనసభ భవనానికి ఎత్తైన టవర్‌తో ఉన్న ఆకృతిని ఇప్పటికే ఖరారు చేశారు. దీని పై కసరత్తు జరుగుతుంది. శాసనసభ భవనం ఎత్తు.. దానిపై నిర్మించే టవర్‌తో కలిపి 250 మీటర్లు ఉంటుంది. 210 మీటర్ల ఎత్తున టవర్‌లో వీక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తారు. దానిని వ్యూయింగ్ డెక్‌గా పిలుస్తారు. ఒకేసారి 150 మంది ఆ డెక్‌పై నిలబడి రాజధానిని వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.
అక్కడి నుంచి 250 మీటర్ల ఎత్తు వరకు వెళ్లేందుకు పారదర్శకంగా అద్దాలతో రూపొందించిన లిఫ్ట్ ఉంటుంది. అందులో టవర్ చిట్ట చివరికి వెళ్లి అక్కడి నుంచి రాజధాని మొత్తాన్ని చూడవచ్చు. టవర్ చివరికి వెళ్లాక లిఫ్ట్ ఐదు నిమిషాలు ఆగుతుంది. దీనిలో ఒకేసారి 30 మంది వెళ్లేందుకు వీలుంటుంది. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌లో 276 మీటర్ల ఎత్తు నుంచి నగరం మొత్తాన్ని వీక్షించే వీలుంది. ‘‘అమరావతిలో నిర్మించే శాసనసభ భవనం టవర్ ఎత్తుని కూడా ఆస్థాయికి పెంచేలా ఆకృతిలో మార్పులు చేస్తామని నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వచ్చే నెల 15 నాటికి డ్రాయింగ్స్ అందజేస్తారని, అప్పటి నుంచి అంచనాల రూపకల్పనకు వారం పది రోజులు పడుతుందని, వచ్చే నెలాఖరుకి టెండర్లు పిలుస్తామని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. శాసనసభ భవనంలో 9 లక్షల చ.అడుగుల నిర్మితప్రాంతం ఉంటుంది. రాజధానిలో తొలి దశలో మౌలిక వసతుల అభివృద్ధికి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం వంటి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి సుమారు రూ.38 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేశారు. వీటిలో సుమారు రూ.28 వేల కోట్ల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేశారు. మరో రూ.10 వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ నిధుల్ని వివిధ మార్గాల్లో సమీకరించేందుకు సీఆర్‌డీఏ ప్రణాళికలు రూపొందించింది.