నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఇక జట్ స్పీడుగా సాగనుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం మంచి జోష్ మీద ఉంది. ఇప్పటి వరకు నిర్మాణాలపై ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్జీటి ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన వెంటనే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. రాయపూడి- లింగాయపాలెంల మధ్య, ఎన్-10 రహదారిని కృష్ణానదికి అవతలి వైపున ఉన్న ఇబ్రహీంపట్నం పవిత్రసంగమ ప్రదేశానికి అనుసంధానిస్తూ నిర్మించదలచిన ఈ బ్రిడ్జికి రూ.1434.26 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు.
6 వరుసలతో, 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మితమయ్యే ఈ వంతెనకు సంబంధించిన సర్వే పనుల నుంచి డిజైన్ రూపకల్పన, నిర్మాణం వరకూ టెండర్లు పొందిన సంస్థే బాధ్యత తీసుకోవాలి. ‘ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్)’ విధానంలో నిర్మించే ఈ వంతెన పూర్తయిన తర్వాత 10 సంవత్సరాలపాటు నిర్వహణ బాధ్యతలను కూడా అదే సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 18వ తేదీ వరకూ గడువునిచ్చారు.
మరో పక్క అమరావతికి, హడ్కో ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పటికే రుణం మంజూరు కావడంతో పనుల వేగం పెంచాలని ప్రభుత్వం భావించింది. ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం పేరుతో ప్రభుత్వం పర్యావరణానికి హాని చేస్తోందంటూ వస్తున్న విమర్శలకు ఎన్జీటీ పూర్తిగా చెక్ పెట్టినట్లు అయింది. కొండవీటి వాగును బూచిగా చూపే ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొట్టింది. గ్రీన్ ట్రిబ్యుల్ తీర్పు వచ్చిన వెంటనే ప్రభుత్వం ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచింది.