రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై ఇవాళ సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదోపవాదనలు టెన్షన్‌ను పెంచుతున్నాయి. తొలిరోజే ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మధ్య వాడివేడి వాదనలు చోటుచేసుకున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల ధరలు అమాంతం పెంచినట్టు వస్తున్న ఆరోపణలతో పాటు.. విమాన ధరల వివరాలు వెల్లడించకూడదన్న నిబంధనపైనే ప్రధానంగా వాదనలు జరుగుతున్నాయి. భారత్, ఫ్రాన్స్ చేసుకున్న ఈ ఒప్పందంలో గోప్యతా నిబంధన కారణంగానే ధరల వివరాలు చెప్పేందుకు కేంద్రం నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.
ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీకోర్టు ఇవాళ విచారణ ప్రారంభించింది. ప్రశాంత్ భూషణ్, మాజీ కేంద్రమంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీ తదితరులు దాఖలు చేసిన ఈ పిటిషన్లపై... చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. రాఫెల్ ఒప్పందంలో జరిగిన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే తెప్పించుకున్న ధర్మాసనం.. విమాన ధరల వివరాలను కూడా సీల్డ్ కవర్లో రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోప్యతా నిబంధనను అడ్డంపెట్టుకుని రాఫెల్ యుద్ధ విమానాల ధరలు ఎలా దాస్తారని ప్రశాంత్ భూషణ్ వాదిస్తున్నారు. ‘‘దేశ భద్రతకు సంబంధించిన విమాన ధరలు వెల్లడించకుండా ఎలా దాస్తారు?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అధికారులే రావాలి... ఆయుధాల సేకరణ కోర్టు సమీక్షించజాలదని అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదించారు. ఈ ఒప్పందం గురించి కోర్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వివరించే ప్రయత్నం చేయగా... సుప్రీం కోర్టు నిరాకరించింది. నేరుగా ఐఏఎఫ్ అధికారుల వివరణ వింటామని... ఇది వారికి సంబంధించిందని సుప్రీం కోర్టు స్పష్ట చేసింది. దీంతో హుటాహుటిన ఐఏఎఫ్ అధికారులు కోర్టుకు బయలు దేరారు. అంతకుమునుపు మరో పిటీషనర్ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ తన వాదనను కోర్టుకు వినిపించారు.