జపాన్ దిగ్గజ సంస్థ ‘టోరే’ రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో మెగా టెక్నికల్ టెక్స్‌టైల్ ప్లాంట్‌ను స్థాపించేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును రూ.1000 కోట్లతో చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 11న శంకుస్థాపనకు ముహూర్తం కూడా నిర్ణయించారు. టోరే అధ్యక్షుడు అకిహిరో నిక్కాకుతోపాటు రాష్ట్ర మంత్రులు లోకేశ్, అమర్నాథరెడ్డిలు ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రపంచంలోని వెయ్యి భారీ పరిశ్రమల్లో ఒకటిగా టోరేకు గుర్తింపు ఉంది. ఈ సంస్థను 1926లో ప్రారంభించారు. మన దేశంలోని గురుగావ్‌లో సేల్స్, చెన్నైలో టోరే వ్యాపార కార్యాలయాలు ఉన్నాయి.
ఆ సంస్థ మన దేశంలో ఒక మెగా టెక్నికల్ టెక్స్‌టైల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుండటం మాత్రం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టులో పరిశుభ్రత, ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను అత్యాధునిక సాంకేతికత సాయంతో తయారు చేస్తారు. వీటిలో పిల్లలు, పెద్దలు వినియోగించే డైపర్స్ కీలకమైనవి. శ్రీసిటీలో స్థాపించే టోరే ప్లాంటులో 165 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తారు. ఇప్పటికే ప్రోక్టర్ అండ్ గ్యాంబల్, కింబర్లీ క్లార్క్, యూనీచార్మ్ వంటి సంస్థలు డైపర్ల తయారీలో ఉన్నాయి. వీటికి టోరే ఉత్పత్తులు గట్టి పోటీ ఇస్తాయని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో తూర్పున పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీస్తోంది. సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో ఏర్పాటు చేసిన శ్రీసిటీ పారిశ్రామికవాడ అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచింది. వివిధ దేశాలకు చెందిన పలు బహుళజాతి సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. తూర్పు మండలాలు పరిశ్రమల స్థాపనకు అనువైన ప్రాంతం. చక్కని రవాణా వ్యవస్థ, నీటివనరులతో పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉంది. ఇప్పటికే సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల పరిధిలో సుమారు 5 వేల ఎకరాల విస్తీర్ణంలో శ్రీసిటీ పారిశ్రామికవాడ ఏర్పాటు చేశారు. పలు బహుళజాతి సంస్థలతో పాటు దేశీయ కంపెనీలు కూడా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. శ్రీసిటీలో ఇప్పటికే సుమారు వంద వరకు పరిశ్రమలు ఏర్పాటై పని ప్రారం భిం చాయి. ఈ పరిశ్రమల ద్వారా వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.