ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా మధ్య హోరాహరీగా నీటి పంపకం విషయంలో మాటలు తూటాలు పేలుతున్న వాతావరణం ఒక పక్క ఉంది. కేసీఆర్ ఈజ్ మ్యాగ్ననిమస్ అంటూ గతంలో చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు నీళ్ళు సముద్రంలోకి వెళ్తుంటే కానీసం కేసీఆర్ తో మాట్లాడటం లేదు. రాయలసీమను రతనాల సీమ చేస్తా తను, జగన్ నోట్లో స్వీటు పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆ ముచ్చటే చెప్పటం లేదు. అయితే ఇదంతా నాటకం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ మాటకు బలం చేకూరుస్తూ, ఒక ఘటన జరిగింది. తెలంగాణ ప్రభుత్వ అధికారిగా, తెలంగాణ జైళ్ల శాఖ సూపరింటెండెంట్ గా పని చేస్తున్న దశరథ రామిరెడ్డిని రిలీవ్ చేయమని ఏపి ప్రభుత్వం కోరగానే, ఆగమేఘాలపై స్పందించి బదిలీ చేసి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా నియమించారు. ఇది ముఖ్యమంత్రి స్థాయిలో లాబీ చేయకపోతే అయ్యే పని కాదు అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయం ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. తమ సలహాదారుడు కోసం, తెలంగాణా నుంచి అధికారిని తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి, ఇదే స్పూర్తి జల వివాదాల్లో ఎందుకు చూపడంలేదని, కేంద్రానికి లేఖలు రాసే బదులు, ఇందులో మాట్లాడినట్టె కేసీఆర్ తో ఈ జల వివాదం పై కూడా మాట్లాడవచ్చు కదా అని, టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
నిన్న టిడిపి పొలిట్ బ్యూరోలో కూడా ఇదే అంశం చర్చించారు. పొరుగు రాష్ట్రం కావాలని పెట్టుకుంటున్న నీటి వివాదాలపై, ఇద్దరు ముఖ్యమంత్రుల సఖ్యత దృష్ట్యా వివాదం ఎందుకు పరిష్కారం కావడంలేదనే అంశంపై చర్చించారు. ఉమ్మడి శత్రువును ఓడించినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు పొందిన ఆనందం, సఖ్యత, ఇద్దరి మధ్యన ఉన్న సుహృద్భావం ఇప్పుడు ఏమైంది ? అంటూ కాలువ శ్రీనివాసులు ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ, "ఇరు రాష్ట్రాల ప్రజలకు చెందిన భావోద్వేగ అంశాలపై, ఇరు రాష్ట్రాలకు ప్రతినిధులమని చెప్పుకుంటున్న వారు ఎందుకు చర్చించలేక పోతున్నారు ? చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అంశాలను, కేంద్ర ప్రతినిధుల సమక్షంలో, గతంలో చేసుకున్న ఒప్పందాలు, సెక్షన్ 84లో కేంద్ర ప్రభుత్వ పాత్రపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఎందుకు గమనంలోకి తీసుకోవడం లేదు? ఇదంతా ఇద్దరూ ఆడుతున్న రాజకీయ నాటకం మాత్రమే. ఇద్దరి వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాలుతప్ప, రాష్ట్రాల ప్రయోజనాలు, ప్రజలకు సంబంధించిన ప్రయోజనాలు లేవని టీడీపీ అభిప్రాయ పడుతోంది. రాయలసీమ ఎత్తిపోతలైనా, పాలమూరు –రంగారెడ్డి అయినా అపెక్స్ కౌన్సిల్ లో చర్చించి, విభజన చట్టం ప్రకారం చర్చించుకోవచ్చు. భిన్నమైన సిద్ధాంతాలున్న రెండుప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఎవరిని మోసగించడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు వివాదాలను తెర పైకి తెచ్చారో సమాధానం చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. వివాదాలు సృష్టిస్తున్నట్లు నటిస్తున్న ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాత్రిళ్లు మాట్లాడుకొని తెల్లారాక ప్రకటనలిస్తున్నారని తెలుగు ప్రజలంతా అనుకుంటున్నారు. " అని టిడిపి ఆరోపిస్తుంది.