రాఫెల్ ఒప్పందం వివాదాస్పందంగా మారడంతో ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నరేంద్రమోదీ ప్రభుత్వంపై ‘ది హిందూ’ పత్రిక తాజాగా మరో బాంబు పేల్చింది. ఈ ఒప్పందం సందర్భంగా అవినీతి వ్యతిరేక జరిమానాలకు సంబంధించిన కీలక నిబంధనలను రద్దు చేయడంతో పాటు తాకట్టు ఖాతా నుంచి చెల్లింపులు చేయాలన్న ఆర్ధిక సలహాదారుల సిఫారసులను సైతం కేంద్రం తోసిపుచ్చినట్టు వెలుగులోకి తెచ్చింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో అంతర-ప్రభుత్వ ఒప్పందం (ఐజీఏ)కి సరిగ్గా కొద్ది రోజుల ముందు ఈ వ్యవహారం నడిచినట్టు ‘ది హిందూ’ తాజా కథనంలో పేర్కొంది. అవినీతి నిర్మూలనే లక్ష్యమంటూ అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఫ్రాన్స్ ప్రభుత్వంతో ప్రధాని కార్యాలయం (పీఎంవో) అధికారులు నేరుగా చర్చలు జరపడం, భారత చర్చల బృందాన్ని ‘‘తక్కువ చేసేలా’’ వ్యవహరిండంపై రక్షణ శాఖ అధికారులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసినట్టు ఇటీవల ‘ది హిందూ పత్రిక’ ఓ కథనం వెలువరించిన సంగతి తెలిసిందే.

ఇది జరిగిన వారంలోపే మోదీ ప్రభుత్వ మరో నిర్వాకం వెలుగుచూడడం గమనార్హం. రూ.58 వేల కోట్ల విలువైన రాఫెల్ ఒప్పందానికి కొద్దిరోజుల ముందు అత్యున్నత స్థాయిలో రాజకీయ జోక్యం చోటుచేసుకున్నట్టు హిందూ పత్రిక వెల్లడించింది. ‘‘మితిమీరిన జోక్యం, ఏజెంట్లు లేదా ఏజెన్సీలకు కమిషన్లు ఇవ్వడంపై జరిమానా విధించడం’’తో పాటు దసో ఏవియేషన్, ఎంబీడీయే ఫ్రాన్స్ ‘‘కంపెనీ ఖాతాల సమాచారం పొందడం’’ తదితర అంశాలు రక్షణ సామగ్రి కొనుగోలు ప్రక్రియ (డీపీపీ)లో ప్రామాణిక నిబంధనలు. సరఫరా నియమావళిలోని ఈ కీలక అంశాలను భారత ప్రభుత్వం ఉపసంహరించుకునేలా రాజకీయ ఒత్తిళ్లు జరిగినట్టు ‘ది హిందూ’ వెల్లడించింది. 2016 ఆగస్టు 24న ఐజీఏ, అనుబంధ పత్రాలకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలపగా.. 2016 సెప్టెంబర్‌లో నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సారథ్యంలోని రక్షణ పరికరాల కొనుగోలు మండలి (డీఏసీ) సైతం తలూపేసింది. యుద్ధ విమానాలను సరఫరా చేసే బాధ్యత దసోది కాగా, ఎంబీడీఏ ఫ్రాన్స్.. భారత రక్షణ శాఖకు ఆయుధ సరఫరాదారుగా ఉంది.

కాగా డీపీపీ నిబంధనలను పక్కనబెట్టడంపై ఎం.పీ.సింగ్ (ధరల సలహాదారు), ఏఆర్ సూలే (వైమానికదళ ఫైనాన్షియల్ మేనేజర్), రాజీవ్ వర్మ (జాయింట్ సెక్రటీ, వైమానికదళ ఎక్వైజేషన్స్ మేనేజర) సహా నాటి చర్చల బృందంలోని ముగ్గురు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపినట్టు ‘ది హిందూ’ పేర్కొంది. ఐజీఏ ముసుగులో కమర్షియల్ కంపెనీలైన దసో, ఎంబీడీఏ ఫ్రాన్స్‌లతో నేరుగా చర్చలు జరపడం, నిబంధనలు తుంగలో తొక్కడం వివేకం కాదంటూ తమ అసమ్మతి లేఖలో వారు పేర్కొన్నట్టు వెల్లడించింది. ఫ్రాన్స్ నుంచి బ్యాంకు గ్యారంటీతో సంబంధం లేకుండా ఫ్రాన్స్ ప్రధాని నుంచి చట్టపరంగా ఎలాంటి బలంలేని ‘లెటర్ ఆఫ్ కంఫర్ట్‌’తో భారత ప్రభుత్వం సరిపుచ్చుకోవడానికి వెనుక ఈ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. యుద్ధవిమానాలను సరఫరా చేస్తున్న కంపెనీలు రెండూ ప్రైవేటు కంపెనీలు కాబట్టి వాటికి చెల్లింపులు చేసేందుకు తాకట్టు ఖాతా తప్పనిసరిగా ఉండాలి. ఈ ఖాతా నుంచి భారత ప్రభుత్వం తొలుత ఫ్రాన్స్ ప్రభుత్వానికి డబ్బు పంపితే... అది సమయానుకూలంగా సదరు కంపెనీలకు చేరుకోవడం ద్వారా ఆర్ధికంగా భారత్‌కు భరోసా లభిస్తుంది. ఆర్థిక సలహాదారులు చేసిన ఈ సిఫారసులను సైతం కేంద్రం పట్టించుకోకపోవడం గమనార్హం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read