నవ్యాంధ్ర జల, జీవ నాడి పోలవరం ప్రాజెక్టు కొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీటు పనులు చేపట్టిన నవయుగ సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. కేవలం 16 గంటల్లో 8వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేసి జాతీయస్థాయి రికార్డును బద్దలుకొట్టింది. అంతేకాదు... త్వరలో త్రీగోర్జెస్‌ డ్యామ్‌ రికార్డునూ అధిగమిస్తామని ‘నవయుగ’ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ ధీమా వ్యక్తం చేశారు. పోలవరం కాంక్రీటు పనులు మందకొడిగా సాగుతున్న తరుణంలో... రాష్ట్ర ప్రయోజనాల రీత్యా, పాత ధరలకే ఈ పనులు చేపట్టేందుకు నవయుగ సంస్థ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ రంగంలోకి దిగిన తర్వాతే పోలవరం కాంక్రీటు పనులు పరుగులు తీయడం మొదలైంది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో 24 గంటల వ్యవధిలో 7300 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది. ఇప్పటిదాకా ఇదే జాతీయ రికార్డు. దీనిని ఆదివారం పోలవరం ప్రాజెక్టు అధిగమించింది.

polavaram 12062018 2

ఉదయం 7 గంటల నుంచి స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లలో నిరాటంకంగా కాంక్రీట్‌ పనులు కొనసాగాయి. రాత్రి 11 గంటలకల్లా... అంటే 16 గంటల్లో 8000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను ప్రాజెక్టులో ఉపయోగించారు. జాతీయ రికార్డును బద్దలుకొట్టారు. 24 గంటల్లో 11,158 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని పూర్తి చేసారు.. దీని కోసం, 47 వేల సిమెంట్‌ బస్తాలు... 11 వేల క్యూబిక్‌ మీటర్ల మెటల్‌... ఆరువేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక! ఐదు భారీ బ్లాచింగ్‌ ప్లాంట్లు! వందల సంఖ్యలో వాహనాలు! రెండు షిఫ్టులు... మొత్తం 250 మంది ఇంజనీర్లు, ఆరువేల మంది కార్మికులు, సిబ్బంది! 24 గంటల శ్రమ... దీని ఫలితమే... పోలవరం ప్రాజెక్టులో ఒక రికార్డు బద్దలైంది. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల దాకా యంత్రాలు నిర్విరామంగా పని చేశాయి. ఇంజనీర్లు, కార్మికులు, సిబ్బంది కూడా యంత్రాల్లా విసుగూ విరామం లేకుండా పని చేశారు.

polavaram 12062018 3

24 గంటల్లో 10వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సరిగ్గా ఉదయం 7 గంటలకు కాంక్రీటు పని మొదలైంది. వచ్చే వాహనం వస్తూనే ఉంటుంది, వెళ్లేది వెళ్తూనే ఉంది! కాంక్రీట్‌ను ఎప్పటికప్పుడు సరైన ప్రాంతంలో నింపివేసే ప్రక్రియ ఇంజనీర్ల పర్యవేక్షణలో పకడ్బందీగా సాగింది. రాత్రి 11 గంటలకు ‘కాళేశ్వరం రికార్డు’ను అలవోకగా దాటేశారు. తదుపరి టార్గెట్‌... 10వేల క్యూబిక్‌ మీటర్లను సాధించే దిశగా కదిలారు. అయితే... అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా జోరున వర్షం మొదలైంది. శరవేగంగా సాగుతున్న పనికి బ్రేక్‌ పడింది. ‘పదివేల క్యూబిక్‌ మీటర్ల లక్ష్యం చేరుకోలేమేమో!’ అనే ఆందోళన మొదలైంది. అయితే... గంట వ్యవధిలోనే వాన తగ్గింది. అంతే... కార్మికులు, ఇంజనీర్లు ఎగిరి గంతేశారు. రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ పనులు మొదలుపెట్టారు. తెల్లవారుజామున 3, 4, 5, 6 గంటలు ఇలా గుడుస్తూనే ఉన్నాయి. ఏడోగంట రానేవచ్చింది. అప్పటికి నమోదైన కాంక్రీట్‌... 11,158 క్యూబిక్‌ మీటర్లు! ఇంజనీర్లు ఈ ప్రకటన చేయగానే ఒక్కసారిగా ప్రాజెక్టు సైట్‌లో హర్షధ్వానాలు మిన్నంటాయి. ఇంజనీర్లు, కార్మికులు అన్న తేడా లేకుండా సంతోషాన్ని పంచుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read