ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్టులో, అటు సుప్రీం కోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులు అన్నీ, చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉండే కేసులు. ఎవరైనా సరే, ఈ కేసులు కోర్టులు కొట్టేస్తాయని ఇట్టే చెప్తారు. అయితే, ప్రభుత్వం ఈ విషయంలో జరుగుతున్న వరుస తప్పులు తెలుసుకుని, తమ వైఖరి మార్చుకోవాలి కాని, ప్రభుత్వం మాత్రం, హైకోర్టు కాకపోతే సుప్రీం కోర్టుకు వెళ్తాం అని చెప్పటం, అక్కడ కూడా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్న విషయం చూసాం. అయితే ఈ నేపధ్యంలో, ఈ రోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులుగా ఉన్న, పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్‌బాబు, షేక్ హబీబ్ అనే ముగ్గురు న్యాయవాదులు రాజీనామా చెయ్యటం, వెంటనే దాన్ని ప్రభుత్వం ఆమోదించటం జరిగిపోయాయి. ప్రభుత్వానికి సంబంధించిన, కేసుల విషయంలో, వీళ్ళు హైకోర్టులో చూసుకుంటూ ఉంటారు. అయితే వీరి రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం, త్వరలోనే వీరి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయ్యనుంది. అయితే వీరి రాజీనామా విషయం పై ఇప్పుడు పలు ప్రశ్నలు వస్తున్నాయి.
వీరి రాజీనామా ఎందుకు చేసారు ? ప్రభుత్వ విధానాలను మేము మోయ్యలెం అని రాజీనామా చేసారా ? లేక తమ వల్లే ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం వీరితో చర్చించి రాజీనామా చేపించిందా ? లేక వీరంత వీరే రాజీనామా చేసారా అనేది తెలియాల్సి ఉంది. ఈ పరిణామంతో ఒక్కసారిగా ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది. ఇందులో షేక్ హబీబ్ అనే న్యాయవాది మహిళా న్యాయవాది. వీరి ముగ్గురినీ గత ఏడాది నియమించినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం తమ నిర్ణయాలు రాజ్యంగబద్ధంగా, చట్ట ప్రకారం ఉంటె, కోర్టులు కూడా సహకరిస్తాయని, అలా కాకుండా రంగులు వెయ్యటం, రాజ్యాంగం ప్రకారం మాతృభాషలో చదువు, రాజ్యంగం ప్రకారం నియమించిన ఎన్నికల కమీషనర్ ను తప్పించటం లాంటి పనులు చేస్తే, ఏ న్యాయవాది అయినా ఏమి చెయ్యలేరని, న్యాయవాదులు మార్చటం కాదని, ప్రభుత్వం తమ వైఖరిని సరి చూసుకోవాలనే వాదన వినిపిస్తుంది.