ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో నిరుపేదల సొంత ఇంటి కల సాకారం అవుతున్నట్లు గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాలశాఖమంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. సచివాలయం 4వ బ్లాక్‌లోని పబ్లిసిటీ సెల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఒకే రోజు 3 లక్షల మంది పేదలు తమ సొంత ఇళ్లలోకి గృహ ప్రవేశాలు జరిపే మహోన్నత కార్యక్రమం జరుగుతోందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇదొక అద్వితీయమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూనే పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
యూనిట్ ధరను రూ. 70వేల నుంచి రూ. 1.50 లక్షలకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలు, 9 నోటిఫైడ్ మున్సిపాలిటీల పరిధిలోని 2093 వార్డులు, 12,767 గ్రామ పంచాయితీల్లో ఏక కాలంలో 3 లక్షల గృహ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 2.71 లక్షలు, పట్టణాల్లో 24,145 ఇళ్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. హుదూద్ తుపాన్ బాధితులకు సంబంధించిన 5,118 ఇళ్లు కూడా ఇదే కార్యక్రమంలో లబ్దిదారులకు అందచేస్తామన్నారు. రాష్ట్రంలో 2019 మార్చి నాటికి 10 లక్షల గృహాలను ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అందించాలని సీఎం నిర్దేశించారన్నారు. అవినీతికి తావు లేకుండా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో ఇళ్ల నిర్మానానికి ఇచ్చే నిధులు జమ చేయడం, ఇళ్లను జియో ట్యాగింగ్, ఆధార్ ద్వారా అనుసంధానించడం, సిమెంటు తదితర ఇంటి నిర్మాణ సామగ్రీని తక్కువ ధరల్లోనే లబ్దిదారులకు అందుబాటులో ఉంచేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని గృహ నిర్మాణశాఖ ద్వారా అందించడం వల్ల ఇళ్ల నిర్మాణం వేగవంతమైనట్లు మంత్రి తెలిపారు.
గృహప్రవేశ ఏర్పాట్లు... ఇళ్లకు మామిడి తోరణాలు కట్టిస్తున్నారు. ప్రజాప్రతినిధులు వచ్చే చోట్ల మేళతాళాలు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క నియోజకవర్గం మినహా 174 నియోజకవర్గాల పరిధిలోని 664 మండలాలు, 12,767 గ్రామ పంచాయతీలు, 110 మున్సిపాలిటీల్లోని 2,093 వార్డుల్లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళంలో 19,616, విజయనగరంలో 16,504, విశాఖపట్నంలో 27,697, తూర్పుగోదావరిలో 37,207, పశ్చిమగోదావరిలో 27,710, గుంటూరులో 24,767, ప్రకాశంలో 19,655, నెల్లూరులో 19,045, చిత్తూరులో 20,888, కడపలో 15,891, అనంతపురంలో 24,608, కర్నూలులో 24402 ఇళ్లు గృహప్రవేశాలకు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని గురువారం ఉదయం విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే సభలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.