కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో మూడు స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు కాబోతున్నాయి. జైరాజ్ మెగా స్టీల్స్ కంపెనీ రూ.3,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే స్టీల్ ప్లాంట్‌కు సిఎం చంద్రబాబు ఈ నెల 10న శంకుస్థాపన చేయనున్నారు. ఎపిఐఐసి ఇండస్ట్రియల్ హబ్‌లో 1,500 మందికి ఉపాధి కల్పించేలా రెండు దశల్లో ఈ సమగ్ర స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కంపెనీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార పత్రాన్ని సమర్పించింది. ఓర్వకల్లులోనే నాచూ కార్పొరేషన్ అనే కంపెనీ రూ.1,035 కోట్ల పెట్టుబడితో డక్ట్ ఐరన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దాదాపు 2,000 మందికి ఉపాధి కల్పించే ఈ ప్లాంట్‌కు సంబంధించిన ప్రతిపాదనని కంపెనీ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.
ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఓర్వకల్లులోనే 161 ఎకరాలను ఎకరా రూ.3.50 లక్షల చొప్పున కేటాయించేందుకు బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్‌ఎ్‌సఎల్ అనే కంపెనీ కూడా 2,000 మందికి ఉపాధి కల్పించేలా ఓర్వకల్లులోనే రూ.3,000 కోట్లతో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 10న జిల్లాలో పర్యటించనున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులకు నిర్దేశించిన విధులను పకడ్బందీగా నిర్వహించాలని కర్నూలు కలెక్టరు ఎస్.సత్యనారాయణ ఆదేశించారు.
ఈ నెల 10న ఓర్వకల్లు మండలం, కృష్ణగిరి మండలం కంబాలపాడు, కర్నూలు నగరంలో మూడు చోట్ల ముఖ్యమంత్రి పర్యటిస్తారన్నారు. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల, కృష్ణగిరి మండలం కంబాలపాడు, కర్నూలు పట్టణంలో ఏపీఎస్‌పీ రెండో బెటాలియన్‌లో హెలిప్యాడ్, తదితర ఏర్పాట్లు చేయాలని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డిని ఆదేశించారు. పూడిచెర్ల గ్రామంలో ముఖ్యమంత్రి జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్, డా.అబ్దుల్‌హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ ఉచ్ఛార శిక్ష అభియాన్ కింద క్లస్టర్ యూనివర్సిటీలకు శంకుస్థాపన చేయనున్నారన్నారు.