దేశంలో ఇప్పటివరకూ మోదీ వ్యతిరేక కూటమి ఏర్పడడంపై జనంలో ఒక సానుకూల అభిప్రాయం లేదు. రాహుల్ గాంధీ వెనుక ప్రతిపక్షాలేవీ రావని, ప్రతిపక్షాల్లో వాటికి వాటికీ మధ్య సఖ్యత ఉండదని, ప్రధానమంత్రి పదవి కోసం వారిలో వారు కాట్లాడుకుంటారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సైతం బహిరంగ సభల్లో తీవ్రంగా విమర్శించారు. కాని ఉన్నట్లుండి చంద్రబాబు ఢిల్లీ వచ్చి ముఖ్యమైన నేతలను కలుసుకోవడం, వారంతా ఆయన అభిప్రాయాలతో ఏకీభవించడం, త్వరలో అంతా కలుసుకుని భవిష్యత్ కార్యాచరణకు పూనుకోవడం పరిస్థితిలో గుణాత్మక మార్పును తీసుకువచ్చింది. చంద్రబాబు వెలిబుచ్చిన కీలక అభిప్రాయాలతో దేశంలో ప్రతిపక్షాలే కాదు, ప్రజాస్వామిక వాదులు, ఇతర మేధావులూ కూడా అంగీకరిస్తున్నారు.
ఒకటి, దేశంలో సిబిఐ, ఆర్‌బిఐ, ఐబి, ఈడీ, ఐటి, సివిసి మొదలైన అనేక వ్యవస్థల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువ కావడంతో అవి కుప్పకూలిపోతున్నాయి. రెండు, దేశంలో మతతత్వాన్ని, మూకోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ వాతావరణం కలుషితమైంది. మూడు, ప్రతిపక్షాల్లో ఒకో పార్టీని టార్గెట్ చేసి బలహీనపరచడం ద్వారా మోదీ, అమిత్ షాలు ప్రయోజనం పొందాలనుకోవడం. ఈ మూడు చర్యలు దేశంలో నిర్బంధ వాతావరణాన్ని ఏర్పర్చడం వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చంద్రబాబు కలిసిన రాహుల్, ములాయం, అఖిలేష్, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, సురవరం, సీతారాం ఏచూరితో పాటు పలు పార్టీల నేతలూ గ్రహించారు.
సార్వత్రక ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీచేసే మాట దేవుడెరుగు, ప్రస్తుతం బిజెపియేతర ప్రతిపక్షాలన్నీ కూర్చుని చర్చించుకుని బలమైన సంయుక్త కార్యాచరణ ఏర్పర్చుకోకపోతే మొదటికే మోసం వస్తుందని, తాము కకావికలం అవుతామని ఆ పార్టీలన్నీ గ్రహించాయి. అసలు ఆ రకంగా అంతా ఒకే అభిప్రాయానికి రావడం, కలుసుకోవాలనుకోవడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ఒక చరిత్రాత్మక పరిణామం. ఈ పరిణామం వల్ల ప్రజలకు కూడా ఒక ప్రత్యామ్నాయం ఏర్పడుతుందన్న ఆత్మవిశ్వాసం కలుగుతుందనీ, ఆ ఆత్మవిశ్వాసం వల్ల ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాల్లో మోదీకి, బిజెపికి వ్యతిరేక వాతావరణం బలపడేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. నాలుగు రాష్ట్రాల్లో కనుక బిజెపి దెబ్బతింటే ప్రతిపక్షాల ఐక్యత మరింత బలపడుతుంది.