అమెరికాకు చెందిన ప్రముఖ వీక్లీ ‘టైమ్’ మ్యాగజైన్ భారత ఎన్నికలపై ప్రత్యేకంగా అంతర్జాతీయ ఎడిషన్‌ను ప్రచురించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోను కవర్ పేజీగా ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ (భారత దేశాన్ని విభజించేవాడు) అనే శీర్షికతో యూరప్, ఆసియా, మధ్య ప్రాశ్చ్యం, దక్షిణ పసిఫిక్ అంతర్జాతీయ ఎడిషన్‌లలో స్టోరీ ప్రచురించింది. ఈ కథనాన్ని అతిష్ తసీర్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రాయగా తనపై బీజేపీ ప్రతీకార చర్యలకు దిగింది. తసీర్ వికీపీడియాలో ఆతిష్ తసీర్ పేరిట ఉన్న పేజీలో సమాచారాన్ని మార్చివేసి తసీర్ టైమ్ మ్యాగజైన్ తో పాటు పలు అంతర్జాతీయ పత్రిలకు ఫ్రీలాన్స్ పాత్రికేయుడిగా పనిచేస్తూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పీఆర్ మేనేజర్ గా కూడా వ్యహరిస్తున్నారంటూ సెటైర్ వేస్తూ తప్పుడు సమాచారం జోడించారు. టైమ్ మ్యాగజైన్ పైనా బీజేపీ నేతలు మండిపడుతుండగా సోషల్ మీడియాలో కాషాయదళాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
కాగా తసీర్ ‘ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్’ స్టోరీలో ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యం మరో ఐదేళ్లు మోడీ ప్రభుత్వాన్ని భరించగలదా..? అన్న హెడ్‌లైన్‌తో నెహ్రూ, మోడీకి మధ్య వ్యత్యాసం గురించి, మోడీ హయాంలో హిందు-ముస్లిం సంబంధాలు, మోడీని తిట్టడం ద్వారా హిందూ అనుకూలమైన వ్యక్తులుగా నిరూపించుకోవడం, మోడీ ప్రభుత్వ హయాంలో వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, క్రిస్టియన్లు అవమానాలు ఎదుర్కొన్నారని, 2014 ఎన్నికల సందర్భంగా ఆర్థికపరమైన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారని, మోడీ ప్రధాని అయ్యాక ఆర్థికంగా ఎలాంటి అద్భుతాలు జరగలేదని, భారత దేశంలో నేషనలిజం అనే అంశం పెరిగిందే తప్పా, ఎలాంటి అభివృద్ధి జరగలేదని, మాజీ ప్రధాని నెహ్రు లౌకికవాదాన్ని, మోడీ హయాంలో ప్రబలుతున్న సామాజిక ఉద్రిక్తతతో పోల్చుతూ తసీర్ కథనం సాగింది.
ఇదే టైం మ్యాగజైన్ మోదీ ముఖచిత్రంతో ‘వై మోదీ మ్యాటర్స్’ అంటూ గొప్పదనాన్ని కీర్తిస్తూ 2015లో స్టోరీ రాసుకొచ్చింది. అప్పుడు ఇదే బీజేపీ నేతలు కూడా ఇలాంటి మ్యాగజైన్ ప్రపంచంలోనే లేదంటూ ఆకాశానికి ఎత్తేశాయి. అదే మ్యాగజైన్ ఇప్పుడు నాలుగేళ్ళలో మోడీ వైఫల్యాలను ఎండగడితే తిట్లదండకాన్ని అందుకోవడం విశేషం. స్టోరీ రాసిన జర్నలిస్టుకు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా విమర్శలు గుప్పించడంతో పాటు ఆయనకు సంబంధించిన అంశాలను వక్రీకరించి పబ్లిసిటీ చేస్తున్నారు. కాగా నాలుగేళ్ళలో మోడీ పరిస్థితి ఏంటో ఉదాహరణే ఈ మ్యాగజైన్ అని, ఇప్పుడు మోడీ నిజస్వరూపం బయటపడుతుందని ప్రతిపక్షాలు బీజేపీ-మోడీలపై సెటైర్లు వేస్తున్నారు.