దేశంలో ఆవాస యోగ్యమైన ప్రాంతాల జాబితాను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.‘ఆవాస యోగ్యమైన ప్రాంతాలు’ పేరుతో విడుదల చేసిన జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు సత్తాచాటాయి. మెట్రోనగరాలను వెనక్కి నెట్టి ఈ సారి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలు స్థానాలు సంపాదించుకున్నాయి. దేశవ్యాప్తంగా పూణె ప్రధమస్థానంలో నిలవగా, దేశరాజధాని దిల్లీ 65వ స్థానానికి పరిమితమైంది. కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ సోమవారం విడుదల చేసిన ‘ఆవాస యోగ్యతా సూచి(ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్)’ను విడుదల చేసింది.
సంస్థలు,పరిపాలన(ఇన్‌స్టిట్యూషనల్), సామాజిక సదుపాయాలు(విద్య, ఆరోగ్యం), ఎకనామిక్ ఫ్యాక్టర్స్, మౌలిక సదుపాయాలు అనే నాలుగు అంశాల ప్రాతిపదికగా చేసిన సర్వేలో మూడింటిలో తిరుపతి చోటు సంపాదించుకుంది. సంస్థలు, పరిపాలనాపరంగా నవీ ముంబయి మొదటి స్థానంలో ఉండగా, తిరుపతి రెండోస్థానంలో ఉంది. చివరి స్థానంలో విశాఖపట్నం నిలిచింది. వైద్యం, విద్య పరంగా తిరుపతి మొదటి స్థానంలో నిలవగా, విజయవాడ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. ఆర్థిక ఆంశాల తీరుగా చండీగఢ్ తొలిస్థానంలో నిలవగా చివరిస్థానంలో విజయవాడ నిలిచింది.
మౌలిక సదుపాయాల పరంగా గ్రేటర్ ముంబయి తొలిస్థానంలో నిలవగా, ఆరోస్థానంలో తిరుపతి, చివరిస్థానంలో విశాఖపట్నం ఉన్నాయి. మరో పక్క, దేశవ్యాప్తంగా పరిశుభ్రమైన రైల్వేస్టేషన్ల జాబితాలో కూడా ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. పరిశుభ్రమైన రైల్వేస్టేషన్ల జాబితాలో గతేడాది అగ్రస్థానంలో నిలిచిన విశాఖపట్టణం ఈ ఏడాది పదో స్థానానికి పడిపోయింది. ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుపతి, విజయవాడ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. క్లీనెస్ట్ జోన్‌గా నార్త్ వెస్ట్రన్ రైల్వేస్టేషన్ అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణమధ్య రైల్వే రెండో శుభ్రమైన జోన్‌గా నిలిచింది. గతేడాది దక్షిణమధ్య రైల్వే ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే మూడో స్థానంలో ఉంది.